Share News

గర్భిణుల వసతిగృహాలు నిర్వీర్యం

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:30 PM

గుమ్మలక్ష్మీపురం, సాలూరులోని గిరిజన గర్భిణుల వసతిగృహాలు నిర్వీర్యం అవుతున్నాయి.

 గర్భిణుల వసతిగృహాలు నిర్వీర్యం
గుమ్మలక్ష్మీపురం వసతిగృహంలో నలుగురు గర్భిణులు మాత్రమే ఉన్న దృశ్యం

- రెండేళ్లుగా సిబ్బందికి చెల్లించని జీతాలు

- నిర్వహణకు నిధులు మంజూరు చేయని ఐటీడీఏ

- వీటిల్లో చేరే గర్భిణుల సంఖ్య తగ్గుముఖం

గుమ్మలక్ష్మీపురం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురం, సాలూరులోని గిరిజన గర్భిణుల వసతిగృహాలు నిర్వీర్యం అవుతున్నాయి. గతంలో గర్భిణులతో కిటకిటలాడిన ఈ వసతి గృహాలు ప్రస్తుతం బోసిపోతున్నాయి. సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం, నిర్వహణకు ఐటీడీఏ నిధులు మంజూరు చేయకపోవడం తదితర కారణాలతో ఈ వసతి గృహాలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. 2016 జూలైలో అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లక్ష్మీషా గుమ్మలక్ష్మీపురం, సాలూరు కేంద్రాలుగా గర్భిణుల వసతి గృహాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వసతి గృహానికి ఆరుగురు ఏఎన్‌ఎంలు, ఒక డ్రైవర్‌, ఒక స్వీపర్‌ను అవుట్‌సోర్సిగ్‌ పద్ధతిలో నియమించారు. మారుమూల కొండ శిఖర గ్రామాల్లోని గిరిజన గర్భిణులను 7, 8 నెలల్లో ఈ వసతి గృహాలకు తరలించేవారు. ఇక్కడ గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయడం, యోగా తదితర ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టేవారు. వారు ప్రసవం అయిన తర్వాత ఐటీడీఏ వాహనంలో తల్లీబిడ్డను వారి ఇంటికి తరలించేవారు. వందలాదిమంది గర్భిణులకు ఈ వసతిగృహాలు ఎంతగానో ఉపయోగపడేవి. వీటివల్ల మాతాశిశు మరణాల సంఖ్య తగ్గింది. అయితే, ప్రస్తుతం అధికారుల అనాలోచిత చర్యలు, ప్రజా ప్రతినిధులకు తగిన శ్రద్ధ లేకపోవడం తదితర కారణాలతో వసతిగృహాలు నిర్వీర్యం అవుతున్నాయి. గుమ్మలక్ష్మీపురం, సాలూరులో పనిచేస్తున్న సుమారు 14 మంది వసతిగృహ సిబ్బందికి గత రెండు సంవత్సరాలుగా జీతాలు చెల్లించడం లేదు. ఈ వసతిగృహాలను నిర్వీర్యం చేస్తే సిబ్బంది వెళ్లిపోతారనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో వైద్య ఆరోగ్యశాఖ ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు కొండ శిఖర గ్రామాల్లో గర్భిణులను గుర్తించి వసతిగృహాలకు తీసుకువచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వారిసంఖ్య గణనీయంగా తగ్గింది. గురువారం గుమ్మలక్ష్మీపురంలోని వసతిగృహాన్ని పరిశీలించగా నలుగురు గర్భిణులు మాత్రమే ఉన్నారు. తమకు రెండేళ్లుగా జీతాలు లేవని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గర్భిణులకు పౌష్ఠికాహారం అందించే సంస్థకు కూడా గత ఏడాదిగా ఐటీడీఏ నిధులు మంజూరు చేయడం లేదు. ఇక్కడి వసతిగృహాలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఏర్పాటు చేశారు. అంతటి ఘనకీర్తి ఉన్న ఈ వసతి గృహాలను నిర్వీర్యం చేసి మూసివేసే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తగిన చర్యలు తీసుకొని గర్భిణుల వసతిగృహాలకు పూర్వ వైభవం వచ్చేలా చూడాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ విషయమై పార్వతీపురం ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతిని వివరణ కోరగా.. ‘సిబ్బందికి జీతాలు చెల్లించడానికి నిధులు లేవు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో బర్త్‌ వెయిటింగ్‌ హాల్స్‌ ఉన్నాయి. గర్భిణులను ఆ వెయింటింగ్‌ హాల్స్‌లో చేర్చుతున్నాం.’ అని తెలిపారు.

Updated Date - Jun 04 , 2026 | 11:30 PM