Share News

నేడు విశాఖకు బంగ్లాదేశ్‌ బాధిత మత్స్యకారులు

ABN , Publish Date - Feb 02 , 2026 | 12:11 AM

బంగ్లాదేశ్‌లో బందీలై ఇటీవల విడుదలైన భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన తొమ్మిదిమంది మత్స్యకారులు సోమవారం ఉదయం విశాఖ చేరుకోనున్నారు.

నేడు విశాఖకు బంగ్లాదేశ్‌ బాధిత మత్స్యకారులు

భోగాపురం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌లో బందీలై ఇటీవల విడుదలైన భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన తొమ్మిదిమంది మత్స్యకారులు సోమవారం ఉదయం విశాఖ చేరుకోనున్నారు. విజయ నగరం జిల్లా భోగాపురం మండలం కొండ్రాజుపాలెంకు చెందిన మరుపల్లి చిన్నఅప్పన్న, మరుపల్లి రమేష్‌, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్‌, సురపతి రాము, అప్పలకొండ, పూసపాటిరేగ మండలం తిప్పల వలసకు చెందిన నక్కా రమణ, వాసపల్లి సీతయ్య, మైలపల్లి అప్పన్న వీరందరూ గతేడాది అక్టోబరు 13వ తేదీన విశాఖ హార్బర్‌ నుంచి చేపలవేట నిమిత్తం సముద్రంపైకి వేటకి వెళ్లారు. సముద్రంలో వేట సాగిస్తూ అదే నెల 22వ తేదీ వేకువ జామున సుమా రు 2గంటల సమయంలో సముద్రంలో బంగ్లాదేశ్‌ సరిహద్దు దాటారు. దీంతో అక్కడ కోస్టుగార్డ్సు వారిని అరెస్టు చేశారు. అయితే ఇరుదేశాల అంగీకారంతో మత్స్యకారులను గతనెల 27న అక్కడ విడుదల చేశారు. అనంతరం గత నెల 28న అక్కడ నుంచి సముద్ర మార్గాన బయలుదేరారు. ఆదివారం రాత్రి విశాఖ తీరానికి చేరుకోనున్నారు. అయితే రాత్రి సమయంలో తీరానికి రాకుండా కొంత సమయంలో తీరం సమీప సముద్రంలోనే ఉండి సోమవారం నాటికి తీరానికి చేరనున్నట్టు సమాచారం. అలాగే స్థానిక కోస్టుగార్డ్సు నిబంధనలన్నీ పూర్తి చేసి బంగ్లాదేశ్‌ నుంచి తీసుకొచ్చిన మత్స్యకారులను అధికారుల సమక్షంలో కుటంబీకులకు అప్పగించనున్నారు. బోట్‌ డ్రైవర్‌ మరుపల్లి చిన్నప్పన్నతో ఫోన్‌ ద్వారా మాట్లాడగా.. ప్రస్తుతం (రాత్రి7.20 సమయంలో) చింతపల్లి సముద్ర పరిధిలో ఉన్నామని సోమవారం ఉదయం విశాఖ తీరం చేరుకుంటామని తెలిపారు.

Updated Date - Feb 02 , 2026 | 12:11 AM