Share News

రోదన...వేదన

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:51 AM

స్టీల్‌ప్లాంటు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలతో మంగళవారం ఉదయం కేజీహెచ్‌ మార్చురీ వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

రోదన...వేదన

మార్చురీ వద్ద మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరు

విధుల్లోకి వెళ్లే ముందుచెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ భోరున విలపించిన వైనం

ఏడు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులు

విశాఖపట్నం/మహారాణిపేట/అగనంపూడి/పెదగంట్యాడ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలతో మంగళవారం ఉదయం కేజీహెచ్‌ మార్చురీ వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. విధుల్లోకి వెళుతూ చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి వెళ్లిన వ్యక్తి మళ్లీ రాలేదంటూ ఒకరు, ఆరోగ్యం బాగాలేదు కాబట్టి విశ్రాంతి తీసుకోవాలని చెప్పిన తండ్రి మాటలను గుర్తుచేసుకుంటూ మరొకరు, పని చేయడానికి కష్టంగా ఉన్నా ఇళ్లు గడవడానికి వెళుతున్నానంటూ చెప్పిన మాటలను నెమరువేసుకుంటూ ఇంకొకరు...విలపించిన తీరు అక్కడున్న వారి మనసులను కదిలించింది.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు స్టీల్‌ప్లాంటు నుంచి కేజీహెచ్‌కు తరలించారు. ఒక్కో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బిహార్‌కు చెందిన గోల్డ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పోస్టుమార్టం నిర్వహించలేదని అధికారులు చెబుతున్నారు.


పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి వెళ్లారు

జీవీ అప్పారావు భార్య రాచమ్మ

ప్రమాదంలో మృతిచెందిన జీవీ అప్పారావు భార్య రాచమ్మ విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. అప్పారావును రంగారెడ్డి జిల్లాకు చెందిన రాచమ్మ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు...ధనుష్‌, లోకేష్‌. ఇద్దరూ వారం నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. ధనుష్‌కు జ్వరం ఎక్కువగా ఉండడంతో స్టీల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ముందురోజు రాత్రి ఆస్పత్రిలో కొడుకు బెడ్‌ పక్కన కిందే పడుకున్నారని, విధులకు వెళ్లే ముందు కూడా కొడుకులను జాగ్రత్తగా చూసుకోవాలంటూ చెప్పి వెళ్లారని రాచమ్మ విలపించింది. ఈ నెల నాలుగో తేదీన తమ పెళ్లి రోజు అని, బట్టలు కూడా కొనుక్కోకపోవడంతో బుధవారం తన పుట్టినరోజు నాడు కొందామని చెప్పారని...ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయావంటూ భోరుమంది. డ్యూటీ ఇబ్బందిగా ఉందని చెప్పేవారే తప్ప...మానేందుకు ఒప్పుకునే వారు కాదని, విధుల్లో నుంచి బయటకు రాగానే ఏసీ ఆన్‌ చేసి ఉంచాలని చెప్పేవారని తెలిపింది. పిల్లల కోసం, నీకోసమే కష్టపడుతున్నానని చెప్పిన ఆయన...ఇప్పుడు తమ కోసమే శాశ్వతంగా వెళ్లిపోయారంటూ విలపించింది. మిస్‌ రాచమ్మ అంటూ తనను ఆటపట్టించే ఆయన లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, తనకు, తన బిడ్దలకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరయ్యారు. డ్యూటీకి వెళ్లిన తరువాత కర్చీఫ్‌ పట్టుకువెళ్లారా.? లేదా.? అని ఫోన్‌ చేశానని, అప్పుడు కూడా కొడుకులు జాగ్రత్త అంటూ చివరి మాట చెప్పారని విలపించారు.


పిల్లలకు ఉద్యోగాలు వచ్చిన తరువాత మానేయాలనుకునేవారు..

బి.త్రినాథరావు భార్య రాధ

కష్టంగా ఉన్నా ఇల్లు గడవాలంటే తప్పదు కదా...అంటూ డ్యూటీకి వెళ్లేవారని బి.త్రినాథరావు భార్య రాధ వాపోయారు. ఇద్దరు పిల్లలను చదివించేందుకు తీవ్రంగా శ్రమించిన ఆయన...25 ఏళ్ల నుంచి పని చేస్తున్నారని తెలిపారు. గతంలో రూ.25 వేలు జీతం ఇచ్చేవారని, ఇప్పుడు రూ.20 వేలు వస్తుండడంతో చాలాసార్లు మానేయాలనుకున్నారన్నారు. కానీ, పిల్లల చదువులకు ఇబ్బందులు కాకూడదన్న ఉద్దేశంతో కష్టంగానే వెళ్లేవారని, ఇద్దరు అబ్బాయిలు బీటెక్‌ పూర్తిచేయడంతో వారికి ఉద్యోగాలు వస్తే మానేయవచ్చునని చెప్పేవారని విలపించింది. ఈలోగా తమకు దూరంగా వెళ్లిపోయారంటూ కన్నీటిపర్యంతమైంది. డ్యూటీకి వెళ్లేముందు ఎప్పటి మాదిరిగానే...వెళ్లి వస్తా, జాగ్రత్త అన్నారని, అవే చివరి మాటలు అవుతాయని తాము ఊహించలేదంది.


అనారోగ్యంగా ఉన్నా డ్యూటీకి వెళ్లకుండా ఉండేవారు కాదు

నక్కా వెంకటరమణ కుమారుడు దుర్గాప్రసాద్‌

ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాన్న ఎప్పుడూ విధులకు వెళ్లకుండా ఉండేవారని కాదని ప్రమాదంలో మృతిచెందిన నక్కా వెంకటరమణ కుమారుడు దుర్గాప్రసాద్‌ విలపించారు. తల్లి జోగమ్మతో కలిసి మార్చురీ వద్దకు వచ్చిన దుర్గాప్రసాద్‌ తండ్రి చెప్పిన చివరి మాటలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. 30 ఏళ్ల నుంచి చాలీచాలని జీతంతోనే పని చేసుకుంటూ వస్తున్నారని, అనారోగ్యంగా ఉన్నా డ్యూటీకి వెళ్లకుండా ఉండేవారు కాదని పేర్కొన్నారు. తాను మట్టి పనికి వెళుతుంటానని, అమ్మ రోజువారీ కూలీ పనులకు వెళుతుంటుందన్నారు. నాన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఇంటి నుంచి డ్యూటీకి బయలుదేరి వెళ్లారని, అప్పటికి ఇంట్లోనే ఉన్న తనకు జాగ్రత్తగా ఉండంటూ చెప్పి వెళ్లారన్నారు. తనకు నీరసంగా ఉందని పనికి వెళ్లకపోవడంతో రెస్ట్‌ తీసుకోవాలని చెప్పిన నాన్న...ఒక్కరోజు కూడా తనను పల్లెత్తు మాట అనడం తెలియదంటూ వాపోయాడు.


డ్యూటీ మార్చినప్పటి నుంచి ఇబ్బందిగా ఉందనేవారు

కృష్ణ నాగ్‌ కుమారుడు హనీష్‌

నాన్న కొన్నేళ్ల నుంచి స్టీల్‌ప్లాంటులో పనిచేస్తున్నారని, అయితే డ్యూటీ మార్చినప్పటి నుంచి ఇబ్బందిగా ఉందని చెబుతుండేవారని కృష్ణ నాగ్‌ కుమారుడు హనీష్‌ తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా డ్యూటీకి వెళ్లకుండా ఉండేందుకు మాత్రం నాన్న ఇష్టపడేవారు కాదని, ఇప్పుడే అదే ఆయన పాలిట మృత్యువుగా మారిందటూ వాపోయాడు. ఇంటి నుంచి ఒంటి గంట సమయంలో డ్యూటీకి వెళ్లారన్నారు. పని చేయడం ఇబ్బందిగా ఉందని, అయినా తప్పడం లేదంటూ నాన్న చెప్పిన మాటలను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇబ్బందిగా ఉంటే డ్యూటీ మానేయాలని చెప్పినా వినేవారు కాదని, తాను మంచి ఉద్యోగంలో చేరితే ఆలోచిస్తాననే వారంటూ చెప్పాడు. నాన్న లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


అన్నకు మూడు నెలల కిందటే బిడ్డ పుట్టాడు...

భానుకుమార్‌ సోదరుడు నరేష్‌

అన్నయ్య మృతిచెందిన విషయాన్ని వదినకు మంగళవారం మధ్యాహ్నం వరకు తెలియనీయలేదని భానుకుమార్‌ సోదరుడు నరేష్‌ చెప్పాడు. మూడు నెలల కిందట అన్నకు బిడ్డ పుట్టాడని, ఇప్పుడు ఈ ఘోరం జరిగిపోయిందంటూ వాపోయాడు. వదినకు మధ్యాహ్నం వరకు విషయం తెలియకుండా చూసుకున్నామని, ప్రమాద విషయం తెలిసి అన్నయ్యకు ఫోన్‌ చేస్తుంటే కలవకపోవడంతో విషయం అర్థమై కన్నీరుమున్నీరుగా విలపిస్తోందని నరేష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులతో ఎంతో అన్యోన్యంగా మెలిగే అన్నయ్య మృతి చెందాదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ వాపోయాడు. వదిన, బిడ్డ పరిస్థితి తల్చుకుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.


విధులకు వెళ్లి తిరిగిరాని లోకాలకు...

ప్రభాకరరావు కుటుంబం కన్నీటి పర్యంతం

విధులకని వెళ్లి తిరిగిరాని లోకాలకు తరలిపోయారని కూన ప్రభాకరరావు (57) కుటుంబీకులు విలపిస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంటులోని ఎస్‌ఎంఎస్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ప్రభాకరరావు మృతిచెందారు. ఆయనకు భార్య అరుణ, కుమారులు ప్రసాద్‌, లోకేష్‌ ఉన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన ప్రభాకరరావు డిప్లొమా చదివి స్టీల్‌ప్లాంటులో కార్మికునిగా చేరి, తరువాత జనరల్‌ ఫోర్‌మెన్‌గా పదోన్నతి పొందారు. ఆయన బీసీ రోడ్డులోని సీతారామ్‌ నగర్‌లో ఉంటున్నారు. పెద్ద కుమారుడు ప్రసాద్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా, చిన్న కుమారుడు కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎనస్థీయన్‌గా పనిచేస్తున్నారు. తండ్రి మృత్యువాత పడిన సంఘటన తెలుసుకుని వీరు నగరానికి చేరుకున్నారు. గుర్తుపట్టలేని విధంగా కాలిపోయి ఉన్న తండ్రిని చూసి నిశ్చేస్టులయ్యారు. ప్రభాకరరావు భౌతికకాయానికి మంగవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి,

Updated Date - Jun 10 , 2026 | 12:51 AM