Share News

పౌర సేవలకు వైజాగ్‌-1

ABN , Publish Date - Mar 12 , 2026 | 01:09 AM

విశాఖపట్నంలో పౌర సమస్యల పరిష్కారానికి ‘వైజాగ్‌-1’ పేరుతో ఒక అప్లికేషన్‌ తయారుచేశామని, దానిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ వెల్లడించారు.

పౌర సేవలకు వైజాగ్‌-1

యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సీఎం సమావేశంలో వెల్లడించిన కలెక్టర్‌

సమస్యలపై ఫిర్యాదులు నేరుగా సంబంధిత శాఖకు...

విద్యుత్‌ బిల్లు, ఆస్తి పన్ను...కూడా చెల్లించవచ్చు

నగర ప్రజలు సూచనలు చేయవచ్చు

మంచి చొరవ చూపారని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌కు ముఖ్యమంత్రి ప్రశంసలు

మనమిత్రలో ఇంటిగ్రేట్‌ చేయాలని ఐటీ కార్యదర్శికి ఆదేశం

విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో పౌర సమస్యల పరిష్కారానికి ‘వైజాగ్‌-1’ పేరుతో ఒక అప్లికేషన్‌ తయారుచేశామని, దానిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ వెల్లడించారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో హరేంధిర ప్రసాద్‌ ఆ యాప్‌ గురించి వివరించారు. ఇది మొబైల్‌ అప్లికేషన్‌ అని, పౌరులు ఎవరైనా సరే...వారు ఎదుర్కొంటున్న సమస్యను అందులో నమోదుచేస్తే, అది సంబంధిత శాఖకు వెళుతుందన్నారు. ఉదాహరణకు పారిశుధ్య సమస్యపై ఫిర్యాదు చేస్తే శానిటర్‌ ఇన్‌స్పెక్టర్‌కు వెళుతుందని, అక్కడ స్పందించకపోతే సూపర్‌వైజర్‌కు, అక్కడి నుంచి అసిస్టెంట్‌ హెల్త్‌ ఆఫీసర్‌కు...ఇలా ఉన్నతాధికారుల వద్దకు వెళుతుందన్నారు. ఆ సమస్య పరిష్కారమైందా?, లేదా?...అని ట్రాకింగ్‌ చేసే వెసులుబాటు కూడా ఉంటుందన్నారు. దీనికి సచివాలయాల వద్ద ఉన్న డేటా బేస్‌ను ఉపయోగించుకుంటామన్నారు. సమస్యలను డేటా అనాలసిస్‌ ద్వారా విశ్లేషించి, ఒకే తరహా సమస్యలు ఒకే ప్రాంతం నుంచి ఎక్కువగా వస్తే, ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించాల్సిందిగా అక్కడి అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తామన్నారు. వీటికి జీవీఎంసీలో స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌లో భాగంగా ఏర్పాటుచేసిన సెంట్రల్‌ కమాండింగ్‌ సెంటర్‌ను ఉపయోగించుకుంటామన్నారు. ఈ యాప్‌ ద్వారానే పౌరులు వారి బిల్లులు చెల్లించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. విద్యుత్‌ బిల్లు, ఆస్తి పన్ను..ఇలా అన్నీ కట్టుకోవచ్చునన్నారు. ఏ బిల్లు ఏ తేదీలోగా చెల్లించాలో రిమైండర్లు కూడా పంపుతామన్నారు.

ఆప్లికేషన్‌ను చదువు రానివారు కూడా ఉపయోగించుకునేలా చాట్‌బాట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. అంటే వాయిస్‌ ద్వారా సమస్య చెబితే దానికి స్పందించి ఏఐ ద్వారా సమాధానం వస్తుందన్నారు. వీటికి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ‘మనమిత్ర’ యాప్‌ను కూడా ఉపయోగించుకుంటామని కలెక్టర్‌ వివరించారు. అత్యవసర సమయాల్లో నగర ప్రజలు ఏమైనా సూచనలు, హెచ్చరికలు చేయాల్సి వస్తే వాటిని కూడా ‘వైజాగ్‌-1’ యాప్‌ ద్వారా చేయవచ్చునన్నారు. ఈ యాప్‌తో వీఎంఆర్‌డీఏను కూడా అనుసంధానం చేశామన్నారు. వీఎంఆర్‌డీఏకు చెందిన కల్యాణ మండపాలు, హాళ్లు బుక్‌ చేసుకోవడానికి, అదే విధంగా మ్యూజియాల సందర్శనకు పర్యాటకులు టికెట్లు తీసుకోవడానికి దీని ద్వారా ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని సేవలు ఒక యాప్‌ నుంచే అందిస్తామన్నారు. ఈ యాప్‌ టెస్టింగ్‌ పూర్తయిందని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ ఆలోచన, కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ చొరవ బాగున్నాయని సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. అయితే ఇలా జిల్లాకు ఒక యాప్‌ పెట్టడం కంటే ప్రభుత్వం పౌర సేవలకు రూపొందించిన వాట్సాప్‌ గ్రూప్‌, మనమిత్రలతో దీనిని ఇంటిగ్రేట్‌ చేస్తే బాగుంటుందని, రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. దీనిని మరింత మెరుగుపరచడానికి చర్యలు చేపట్టాలని ఐటీ సెక్రటరీ కాటమనేని భాస్కర్‌కు ఆదేశించారు.


ప్రజా సానుకూలతలో 8వ స్థానం

విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి వచ్చే సానుకూల స్పందనలో విశాఖ జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచిందని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్రత్యేక వ్యవస్థ ద్వారా ప్రతి జిల్లాలో ప్రజల నుంచి ప్రభుత్వ పథకాల అమలు, సమస్యల పరిష్కారంలో అధికారుల చొరవ, తదితర అంశాలపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గత డిసెంబరులో ఈ విధంగా అభిప్రాయాలు సేకరించినప్పుడు విశాఖ జిల్లాలో 70.7 శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు మళ్లీ అదే అభిప్రాయ సేకరణ చేయగా ఆ స్కోర్‌ 72.3 శాతానికి చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా 74.1 స్కోర్‌తో ప్రథమ స్థానంలో నిలవగా పల్నాడు, కృష్ణా, తూర్పు గోదావరి, ఎల్లూరు, గుంటూరు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

Updated Date - Mar 12 , 2026 | 01:09 AM