ప్రశాంతంగా యూపీఎస్సీ ప్రిలిమినరీ
ABN , Publish Date - May 25 , 2026 | 12:21 AM
జిల్లాలో ఆదివారం నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ పరీక్ష-2026 ప్రశాంతంగా ముగి సింది.
జిల్లాలో 17 కేంద్రాల్లో పరీక్షలు
పలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, జేసీ
విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఆదివారం నిర్వహించిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ పరీక్ష-2026 ప్రశాంతంగా ముగి సింది. 17 కేంద్రాల్లో రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షకు 7,763 మందికి గాను ఉదయం సెషన్‌కు 61.25 శాతంతో 4,755 మంది హాజరయ్యారు. 3,008 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌కు 60.49 శాతంతో 4,696 మంది హాజరుకాగా, 3,067 మంది గైర్హాజరయ్యారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన పకడ్బందీ ఏర్పాట్లు, కేంద్రాల వద్ద భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాల కల్పనతో పరీక్షలు సజావుగా జరిగాయి. అన్ని కేంద్రాల్లో అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించారు. ఉదయం మద్దిలపాలెంలోని వీఎస్ కృష్ణకళాశాల, ఎంవీపీలోని గాయత్రి విద్యాపరిషత్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఎం. అభిషిక్త్‌కిశోర్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
వార్డుల పునర్విభజనపై వెయ్యికిపైగా అభ్యంతరాలు
విశాఖపట్నం, మే 24(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విజనపై వెయ్యికిపైగా అభ్యంతరాలు అందినట్టు టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపారు. జీవీఎంసీ పరిధిని 120వార్డులుగా విభజిస్తూ జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఈనెల 18న ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. అభ్యంతరాలకు ఆదివారం వరకు గడువు ఇవ్వడంతో వెయ్యికిపైగా అందాయి. వీటిలో అత్యధికంగా వార్డుల సంఖ్యను 150 పెంచాలనే డిమాండ్‌తో ఉన్నవే. అన్నింటినీ పరిశీలించిన తర్వాత తుదిముసాయిదాను వచ్చేనెల ఆరున రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. అభ్యంతరాలు అందజేసిన వారిలో నగరానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలతోపాటు అసోషియేషన్ల ప్రతినిధులు ఉన్నారు.
నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభంకానున్నాయి. మొదటి రోజు ప్రథమ భాష పరీక్షకు 2,600 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు వచ్చేనెల ఆరో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ తెలిపారు. ఓపెన్ స్కూళ్ల ద్వారా పది, ఇంటర్ విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మఽఽద్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు.