ఆకట్టుకుంటున్న ఫ్లవర్ షో
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:18 AM
విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సిటీ సెంట్రల్ పార్కులో ఏర్పాటుచేసిన ఫ్లవర్ షో సందర్శకులను ఆకట్టుకుంటోంది.
విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సిటీ సెంట్రల్ పార్కులో ప్రారంభం
భారీగా సందర్శకులు రాక
ఆర్కే బీచ్‌లో ప్రధాన వేదికపై అభిజిత్ నాయర్ సంగీత విభావరి
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాప్) అధికారుల పర్యవేక్షణలో బీచ్ వాలీబాల్, కబడ్డీ పోటీలు
నేడు ఏయూ మైదానంలో ముగ్గుల పోటీలు
సన్ ఇంటర్నేషనల్‌లో వంటల పోటీలు
ఆర్‌కే బీచ్‌లో గాయకుడు రామ్ మిరియాల సంగీత విభావరి
విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉత్సవ్‌లో భాగంగా సిటీ సెంట్రల్ పార్కులో ఏర్పాటుచేసిన ఫ్లవర్ షో సందర్శకులను ఆకట్టుకుంటోంది. అందరికీ అందుబాటులో నగరం మధ్యన ఉండడంతో గురువారం పెద్దఎత్తున సందర్శకులు భారీగా తరలివచ్చారు. మరోవైపు ఆర్కే బీచ్‌లో ప్రధాన వేదికపై సంగీత కళాకారుడు అభిజిత్ నాయర్ ప్రదర్శన యువతను అలరించింది. ఆయన ఆలపించిన గీతాలు మైమరిపించాయి. ఫుడ్ స్టాళ్లు రద్దీగా మారాయి. మంగమారిపేటలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మత్స్యకారులకు బోట్ల పోటీలు ప్రారంభించారు. ఇంటాక్ సాయంతో యువతకు ట్రెజర్ హంట్ కార్యక్రమం ఏర్పాటుచేశారు. మరోవైపు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాప్) అధికారుల పర్యవేక్షణలో బీచ్ వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఏయూ మైదానంలో శుక్రవారం ఉదయం ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. అదేవిధంగా సాగర్‌నగర్‌లోని సన్ ఇంటర్నేషనల్‌లో వంటల పోటీలు, వైజాగ్ క్రౌన్ ఫైనల్ పోటీలు జరగనున్నాయి. ఆర్‌కే బీచ్‌లో శుక్రవారం సినీ గాయకుడు రామ్ మిరియాల సంగీత విభావరి ఏర్పాటుచేశారు.
పుష్ప ప్రదర్శనే ప్రత్యేక ఆకర్షణ: ఎమ్మెల్యే గంటా
విశాఖ ఉత్సవ్‌లో పుష్ప ప్రదర్శనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశంసించారు. సిటీ సెంట్రల్ పార్కులో వీఎంఆర్‌డీఏ ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శనను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ విశాఖ ఉత్సవాలను గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందని, వైసీపీ హయాంలో ఎటువంటి ఉత్సవాలు చేయలేదని, మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని భారీఎత్తున చేపట్టిందన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. కొత్తగా సైకత శిల్పాలను కూడా జత చేశారని, అవి బాగున్నాయంటూ వాటిని తీర్చిదిద్దిన కళాకారుడిని ఎమ్మెల్యేలు పుప్పగుచ్ఛంతో అభినందించారు. వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ మూడు రోజులూ ఉచితంగానే ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. అనకాపల్లిలో కూడా శుక్రవారం నుంచి పుష్ప ప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ సెక్రటరీ మురళీకృష్ణ, సీఈ వినయకుమార్, ఎస్‌ఈ భవానీశంకర్, సీయూపీ శిల్ప, సీఏఓ హరిప్రసాద్, డీఎఫ్‌ఓ వరుణ్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
బోట్ రేస్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే గంటా అసంతృప్తి
మొక్కుబడి తంతుగా చేస్తున్నారంటూ అధికారులపై ఆగ్రహం
భీమునిపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఉత్సవ్‌కు తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని, మమ అనిపించేలా వ్యవహరించారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. భీమిలి మండలం మంగమారిపేట తీరంలో గురువారం ఇంజన్ బోట్ రేస్‌ను కలెక్టర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఇవేనా బోట్ రేస్ ఏర్పాట్లు...ఒక టెంట్ వేస్తే సరిపోతుందా అని అధికారులపై మండిపడ్డారు. ఎలాంటి ప్రచారం చేయకుండా, జనం ఎవరూ లేకుండా ఉత్సవాలు మొక్కుబడి తంతుగా సాగుతున్నాయని విమర్శించారు. ఎవరికోసం ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన విశాఖ ఉత్సవ్ నిర్వహణను మమ అనిపించి, ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మత్స్య శాఖ జేడీ లక్ష్మణరావును నిలదీశారు. అయితే పడవలను మాత్రమే ఏర్పాటుచేయాలని తనకు చెప్పారని...మిగిలిన ఏర్పాట్లు టూరిజం అధికారి మాధవి, స్పోర్ట్సు అధికారి జూన్ గాలియట్ చేయాల్సి ఉందని జేడీ వివరించారు. ఈ దశలో కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ జోక్యం చేసుకుని పడవల పోటీలకు నోడల్ అధికారిగా నియమించినందున మొత్తం బాధ్యత జేడీదేనని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా అధికారుల తీరు సరిగా లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాగా తాను వస్తున్నానని తెలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చారని, ప్రజలు ఎవరూ లేరని, ప్రచారం జరిగి ఉంటే ఎంతోమంది వచ్చేవారని గంటా అన్నారు. అంతేకాకుండా భీమిలిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న వారికి ఎండింగ్ పాయింట్ తెలియజేయకపోవడంపైనా అసహనం వ్యక్తం చేశారు.