Share News

మాతాశిశువుల సేవలకు అత్యాధునిక అంబులెన్సు

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:08 PM

జిల్లాలో మాతాశిశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన అంబులెన్సును అందుబాటులోకి తీసుకువస్తామని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు.

మాతాశిశువుల సేవలకు అత్యాధునిక అంబులెన్సు
అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్సు నివేదికను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిషాంతి

కలెక్టర్‌ టి.నిషాంతి

పాడేరు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాతాశిశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన అంబులెన్సును అందుబాటులోకి తీసుకువస్తామని కలెక్టర్‌ టి.నిషాంతి తెలిపారు. దీనికి సంబంధించి మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో మాతాశిశు మరణాలను అరికట్టడంలో భాగంగా గర్భిణులు, బాలింతలు, శిశువులకు సకాలంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వైద్య సేవలు అందించేందుకు గాను అంబులెన్సు సమకూర్చాలని నిర్ణయించామన్నారు. అంబులెన్సుకు సంబంధించి జిల్లా ఆస్పత్రి మాతాశిశు విభాగం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.సీతారామరాజు రూపొందించిన నివేదికను ఆమె పరిశీలించారు. ఆధునిక సదుపాయాలతో కూడిన అంబులెన్సు అందుబాటులోకి వస్తే జిల్లాలో మాతాశిశువులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్సు వైద్య సేవల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణమూర్తినాయక్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, ఆర్‌ఎంవో డాక్టర్‌ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల స్థితిగతులపై నివేదికలు ఇవ్వండి

జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు సంబంధించిన పాఠశాలల స్థితిగతులపై సమగ్ర సమాచారంతో నివేదికలు ఇవ్వాలని అధికారులను కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మతో కలిసి విద్యాశాఖాధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమాలు, గురుకులాలు, కేజీబీవీల్లోని ప్రస్తుత స్థితిగతులపై బుధవారం నాటికి నివేదికలు సమర్పించాలన్నారు. అలాగే పాఠశాలలు పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఈ క్రమంలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఈవో చెల్లయ్య, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, విద్యాశాఖ ప్రత్యామ్నాయ విద్యా సమన్వయకర్త కూర్మారావు, ఏటీడబ్ల్యూవో అఖిల, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 11:08 PM