అక్రమ బ్లాస్టింగ్‌లపై ఎన్‌జీటీ సీరియస్
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:31 AM
పోలవరం ఎడమ కాలువ తవ్వకం పనుల్లో భాగంగా పాయకరావుపేట వద్ద కాంట్రాక్టర్ చేపట్టిన అక్రమ పేలుళ్లపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌జీటీ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ దక్షిణ విభాగం ముందుకు మంగళవారం పడాల లోవదొర, తదితరులు.. ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరుల శాఖపై పెట్టిన కేసు విచారణకు వచ్చింది.
సంబంధిత అధికారులు విచారణకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం
కేసు విచారణ 15కి వాయిదా
క్షేత్రస్థాయిలో తనిఖీచేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం
పాయకరావుపేట, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం ఎడమ కాలువ తవ్వకం పనుల్లో భాగంగా పాయకరావుపేట వద్ద కాంట్రాక్టర్ చేపట్టిన అక్రమ పేలుళ్లపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్‌జీటీ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ దక్షిణ విభాగం ముందుకు మంగళవారం పడాల లోవదొర, తదితరులు.. ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరుల శాఖపై పెట్టిన కేసు విచారణకు వచ్చింది. హెచ్‌ఎంజే పుష్పసత్యనారాయణ, డాక్టర్ ప్రశాంత్ గార్గ్వా నేతృత్వంలోని ధర్మాసనం వర్చువల్‌గా నిర్వహించిన కేసు విచారణలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పిటీషనర్ తరపున అడ్వకేట్ సంజయ్ ఉపాధ్యాయ వాదనలు వినిపించారు. పోలవరం ఎడమ కాలువ తవ్వకంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిపిన వరుస బ్లాస్టింగుల వల్ల సమీపంలోని ఇళ్ల గోడలు బీటలు వారాయని, మే 24వ తేదీన జరిపిన బ్లాస్టింగు కారణంగా ఒక వృద్ధుడు గాయపడ్డాడని ఎన్జీటీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా గతంలో ఆర్డీఓ జారీచేసిన నిబంధనలను పాటించకుండా పేలుళ్లు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కాగా ఈ రోజు జరిగిన విచారణకు ఏపీ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, మైనింగ్, ఏపీపీసీబీ అధికారులు హాజరుకాకపోవడంతోపాటు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. కేసు విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆ రోజు సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్‌ను పిలిపించేలా ఆదేశాలు జారీచేస్తామని కోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా పిటీషనర్ ఆరోపణల నిజనిర్ధారణకు క్షేత్రస్థాయిలో తనిఖీచేసి, వివరణాత్మక నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఎన్టీటీ కోర్టు ఆదేశించింది.