Share News

హెచ్‌పీవీ టీకాకు గడువు పెంపు

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:34 AM

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు ప్రారంభించిన ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆగస్టు నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. 14 ఏళ్లు నిండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్‌పీవీ(హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌) టీకాను ఉచితంగా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

హెచ్‌పీవీ టీకాకు గడువు పెంపు
బాలికకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేస్తున్న వైద్య సిబ్బంది (ఫైల్‌ ఫొటో)

ఆగస్టు నెలాఖరు వరకు వ్యాక్సినేషన్‌

జిల్లాలో 10,755 మంది ‘టీకా’ వయసు బాలికలు

మే నెలాఖరుకు 8,123 మందికి వ్యాక్సినేషన్‌

మరో మూడు నెలలపాటు పొడిగింపు

ఈ కాలంలో 14 ఏళ్లు నిండే వారికి కూడా టీకాలు

నర్సీపట్నం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు ప్రారంభించిన ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆగస్టు నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. 14 ఏళ్లు నిండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్‌పీవీ(హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌) టీకాను ఉచితంగా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 14-15 ఏళ్ల బాలికలు జిల్లాలో 10,755 మంది ఉన్నట్టు గుర్తించారు. ఈ ఏడాది మార్చి 11న టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి, మే 31లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మే నెలాఖరునాటికి 8,123 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు. ఇంకా 2632 మంది బాలికలు మిగిలిపోయారు. దీంతో ఆగస్టు నెలాఖరు వరకు ప్రభుత్వం గడవు పెంచింది. టీకాలు వేయాల్సిన 2,632 మంది బాలికలతోపాటు జూన్‌ ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు 14 ఏళ్లు నిండి, 15వ ఏటలోకి వచ్చే బాలికలకు కూడా వ్యాక్సిన్‌ వేస్తారు. హెచ్‌పీవీ టీకా కార్యక్రమం నిరంతరం కొనసాంచాలని భావిస్తున్న ప్రభుత్వం, రెండో విడత వ్యాక్సినేషన్‌ను ఈ ఏడాది చివరిలోగా ప్రారంభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కో టీకా ఖరీదు కంపెనీనిబట్టి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంటుందని, దీనిని ప్రభుత్వం ఉచితంగా వేస్తున్నదని జిల్లా టీకా అధికారి చంద్రశేఖర్‌దేవ్‌ తెలిపారు. అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో హెచ్‌పీవీ టీకాలు వేస్తారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 12:34 AM