పెరుగుతున్న వేరుశనగ సాగు విస్తీర్ణం
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:11 PM
ప్రస్తుతం ఏజెన్సీలో వేరుశనగ పంట ఆశాజనకంగా ఉంది. అధిక లాభాలు వస్తుండడంతో ఈ పంటను సాగు చేసేందుకు గిరి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఏజెన్సీలో వేరుశనగ విస్తీర్ణం ప్రతి ఏడాది పెరుగుతోంది. గిరిజన ప్రాంతంలో గతంలో వేరుశనగ పంట ఉండేది కాదు.
ఆశాజనకంగా పంట
అధిక లాభాలు వస్తుండడంతో గిరి రైతుల ఆసక్తి
ఏజెన్సీ వ్యాప్తంగా 3 వేల ఎకరాల్లో పంట
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ప్రస్తుతం ఏజెన్సీలో వేరుశనగ పంట ఆశాజనకంగా ఉంది. అధిక లాభాలు వస్తుండడంతో ఈ పంటను సాగు చేసేందుకు గిరి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఏజెన్సీలో వేరుశనగ విస్తీర్ణం ప్రతి ఏడాది పెరుగుతోంది. గిరిజన ప్రాంతంలో గతంలో వేరుశనగ పంట ఉండేది కాదు. అయితే చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల ప్రోత్సాహంతో జీకేవీధి, చింతపల్లి మండలాల్లో కొంత మంది రైతులు మాత్రమే వేరుశనగను పండించే వారు. కాలక్రమేణా ఏజెన్సీలో అన్ని మండలాల్లోనూ గిరి రైతులు వేరుశనగను పండిస్తున్నారు.
ఏజెన్సీలో నాలుగేళ్ల క్రితం వరకు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ పంట ప్రస్తుతం 3 వేల ఎకరాలకు పెరిగింది. అలాగే వ్యవసాయ సీజన్‌తో సంబంధం లేకుండా కాస్త నీటి సదుపాయం ఉంటే చాలు, పంటతీత తరువాత వెంటనే విత్తనాలు వేస్తున్నారు. దీంతో ఏడాదిలో రెండు మార్లు కచ్చితంగా వేరుశనగ సాగు చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ కాలంలో పంట చేతికి రావడంతో పాటు శ్రమ, పెట్టుబడి తక్కువగా ఉండడంతో గిరి రైతులు వేరుశనగపై క్రమంగా ఆసక్తి చూపుతున్నారని వ్యవసాయాధికారులు అంటున్నారు. అక్టోబరు నెల తరువాత సాగు చేసే వేరుశనగ పంటలో బంతి, మొక్కజొన్న వంటి వాటిని అంతర పంటలుగా వేస్తున్నారు. దీంతో ఏకకాలంలో రెండు పంటల దిగుబడి వచ్చి గిరి రైతులు చక్కని ఆదాయం ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లో అత్యధికంగా పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో మోస్తరుగా వేరుశనగను పండిస్తున్నారు. గిరిజనులు స్థానికంగా జరిగే వారపు సంతల్లోనే బస్తాల చొప్పున వర్తకులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో 50 కిలోల బస్తా రూ.1500 ధర ఉంది.
తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం
ఏజెన్సీలో ఎకరం భూమిలో వేరుశనగ పంటను పండించేందుకు కేవలం రూ.1,000 మాత్రమే వ్యయం అవుతుందని రైతులు తెలిపారు. ఒక గిరిజన కుటుంబం తమ సొంత పనిగా ఎకరం భూమిని దున్ని చదును చేసుకుని, కిలో రూ.80లకు లభిస్తున్న హైబ్రీడ్ రకం వేరుశనగ విత్తనాలను ఎకరానికి పది కిలోలు చొప్పున వేస్తున్నారు. అలాగే 90 రోజుల్లో దిగుబడి వచ్చే ఈ పంటకు ఎటువంటి ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించడం లేదు. అయితే పంట కాలంలో ఒకమారు కలుపుతీసి, గొప్పు తవ్వే పనులు చేపడుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో పంటకు ఆరు బస్తాలు(బస్తా 50 కిలోలు) కాయలు దిగుబడి వస్తున్నాయి. ఈ లెక్కన బస్తా రూ.1,500 ధర ప్రస్తుతం ఉన్నప్పటికీ, ఒకవేళ రూ.50 ధర అటూ ఇటూ ఉన్నా కచ్చితంగా రూ.8 వేల ఆదాయం వస్తుందని హుకుంపేట మండలం జి.బొడ్డాపుట్టు గ్రామానికి చెందిన రైతు కొర్రా లక్ష్మణరావు తెలిపారు. ఒక గిరిజన కుటుంబం ఎకరం విస్తీర్ణంలో వేరుశనగను పండించేందుకు తమ కష్టం, రూ.1,000 వరకు వ్యయం చేస్తే మూడు నెలల్లో రూ.8 వేల ఆదాయం కచ్చితంగా పొందవచ్చునని, ఏడాదిలో రెండు మార్లు పంట సాగుతో మొత్తం రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు ఆదాయం వస్తుందని తెలుస్తున్నది. అలాగే వేరుశనగ సాగు చేస్తున్న గిరిజన రైతులకు వ్యవసాయాధికారులు సలహాలు, సూచనలు అందించి మరింత దిగుబడి ఽసాధించేందుకు కృషి చేస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.