Share News

ప్రాథమిక విద్యపై ఫోకస్‌

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:14 PM

ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఎల్‌ఎన్‌(పునాది, అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

ప్రాథమిక విద్యపై ఫోకస్‌
చింతపల్లిలో ఎఫ్‌ఎల్‌ఎన్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్న డీఆర్‌పీలు

ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఆటపాటలతో బోధన

ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ

చింతపల్లి, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఎల్‌ఎన్‌(పునాది, అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఆట, పాటలతో విద్యాబోధన అందించడంతో పాటు విద్యలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు ఎన్‌ఈపీ(జాతీయ విద్యా విధానం) 2020 స్ఫూర్తితో ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తుండడంతో ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగానే జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు శిక్షణ ఇచ్చారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం అమలు చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం 2024 అక్టోబరులో ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితంకాకుండా ఆధునిక బోధనా పద్ధతులను అందిపుచ్చుకునే విధంగా ఉపాధ్యాయులను సిద్ధం చేస్తూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రెండేళ్లల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించారు.

బాలలకు అర్థమయ్యేలా బోధన

పాఠశాలలో తొలిసారిగా అడుగుపెట్టిన విద్యార్థి స్థాయిని ఉపాధ్యాయులు గుర్తించి ఆట వస్తువుల ఆధారిత బోధన(టాయ్‌ బేస్డ్‌) ద్వారా తరగతి గదిలో చదువును ఆనందదాయకమైన ప్రక్రియగా మార్చడం ఎఫ్‌ఎల్‌ఎన్‌ ప్రధాన లక్ష్యం. ఈ విధానం వల్ల విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకుంటారు. పాఠశాలపై భయం తొలగిపోయి విద్యార్థి చదువుపై ఆసక్తి పెంచుకుంటాడు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ 2020), నిపుణ్‌ భారత్‌ మిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం వల్ల విద్యార్థి మూడవ తరగతి పూర్తయ్యేసరికి ప్రాథమిక పఠన, లేఖన, గణిత నైపుణ్యాలు కచ్చితంగా సాధించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

Updated Date - Jun 09 , 2026 | 11:14 PM