ఎరువుల సరఫరాపై నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:33 AM
ఎరువుల సరఫరా, వ్యవసాయ ప్రణాళికల అమలుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల, డివిజన్‌స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఎరువుల సరఫరా, వ్యవసాయ ప్రణాళికల అమలుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల, డివిజన్‌స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎరువుల అంశంపై ఇప్పటి వరకు ప్రత్యేక సమావేశం నిర్వహించకపోవడం, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ నివేదికలు సమర్పించడంలో జాప్యం చేయడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎరువుల సరఫరా, పంపిణీ ప్రకియలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎరువుల కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని పనులను వేగవంతం చేయాలని చెప్పారు. ఎరువుల సరఫరాలో శాఖల మధ్య సమన్వయం కీలకమని పేర్కొన్నారు. గోదాముల నుంచి మండలాలకు ఎరువులు చేరిన వెంటనే సంబంధిత అధికారులు తమ పరిధిలోని సహకార సంఘాలు, ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు ఎరువుల దుకాణాలకు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు తమ క్షేత్రస్థాయి పర్యటనల వివరాలను ముందుగానే తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సీఎస్‌కే సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ఎరువుల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వుండాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్‌వో వై.సత్యనారాయణరావు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.