డీఈవో బాధ్యతల అప్పగింతపై తర్జనభర్జన
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:10 PM
జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ కె.రామకృష్ణారావు సెలవులో వెళ్లిపోవడంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కొన్ని రోజులుగా తర్జనభర్జన కొనసాగుతోంది.
ఎవరూ ముందుకురాని పరిస్థితి
సందిగ్ధంలో అధికారులు
పాడేరు, జూన్ 9(ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ కె.రామకృష్ణారావు సెలవులో వెళ్లిపోవడంతో ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కొన్ని రోజులుగా తర్జనభర్జన కొనసాగుతోంది. అయితే జిల్లా విద్యాశాఖలో సహాయ సంచాలకులుగా పని చేస్తున్న వారికి లేదా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌కు ఆ బాధ్యతలు అప్పగించేందుకు జిల్లా అధికారులు ఆలోచన చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు నిర్వహించేందుకు ఆ స్థాయి కలిగిన అధికారులు అనివార్య కారణాలతో ముందుకు రావడం లేదు. దీంతో ఎవరికి డీఈవో బాధ్యతలు అప్పగించాలనే దానిపై స్పష్టత రాకపోవడంతో జిల్లా అధికారులు తల పట్టుకుంటున్నారు. 23 మండలాలతో ఉన్న ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో డీఈవో పోస్టుకు ఈ పరిస్థితి రావడం చర్చనీయాంశమైంది. కాగా డీఈవో రామకృష్ణారావు సెలవులో వెళుతూ డిప్యూటీ డీఈవోగా ఉన్న ఎస్.చెల్లయ్యకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తేనే విధులు, ఇతర అధికారిక కార్యక్రమాలను నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. కానీ అందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అయితే టీచర్లకు శిక్షణలు, విద్యార్థులకు విద్యా కానుకల పంపిణీ, ఈ నెల 12న పాఠశాలల పునఃప్రారంభం నేపఽథ్యంలో డీఈవో నియామకంపై తర్జనభర్జన కొనసాగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి అధికారులు చొరవ చూపి జిల్లాకు శాశ్వత డీఈవోను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.