ప్రజారోగ్యానికి కోల్‌కోలేని దెబ్బ!
ABN , Publish Date - Feb 01 , 2026 | 01:11 AM
కశింకోట మండలం బయ్యవరం గ్రామ రైల్వే స్టేషన్ పరిధిలోని బొగ్గు (బ్లాక్ కోల్) యార్డుతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. యార్డులో నిత్యం బొగ్గు లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా ప్రక్రియ జరుగుతుండడంతో దుమ్ము, ధూళి కణాలు పరిసరాల్లోని గ్రామాలపై వ్యాపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పరిసరాల్లోని ప్రజలు అనారోగ్యం పాలవుతుండడంతో యార్డును ఇక్కడ నుంచి తరలించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
- బయ్యవరం రైల్వే స్టేషన్ సమీపంలో పదేళ్ల క్రితం బొగ్గు నిల్వ చేసే యార్డు ఏర్పాటు
- ఇక్కడ నుంచి పెదగంట్యాడ మండలంలోని ప్రైవేటు విద్యుత్ ప్లాంట్‌కు బొగ్గు రవాణా
- ప్రస్తుతం రోజూ 150 లారీల్లో సరుకు తరలింపు
- బొగ్గు ధూళి కణాలు ఎగసి పరిసర ప్రాంతాల ప్రజలకు అనారోగ్య సమస్యలు
- గతంలో కాలుష్య నియంత్రణ మండలికి మూడు గ్రామాల ప్రజలు ఫిర్యాదు
- స్పందన లేకపోవడంతో రేపు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు సన్నద్ధం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
కశింకోట మండలం బయ్యవరం గ్రామ రైల్వే స్టేషన్ పరిధిలోని బొగ్గు (బ్లాక్ కోల్) యార్డుతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. యార్డులో నిత్యం బొగ్గు లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా ప్రక్రియ జరుగుతుండడంతో దుమ్ము, ధూళి కణాలు పరిసరాల్లోని గ్రామాలపై వ్యాపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పరిసరాల్లోని ప్రజలు అనారోగ్యం పాలవుతుండడంతో యార్డును ఇక్కడ నుంచి తరలించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
కశింకోట మండలం బయ్యవరంలో 820 గృహాల్లో 2,860 మంది, జమ్మాదులపాలెంలో 580 గృహాల్లో 1,950 మంది, రామన్నపాలెంలో 345 ఇళ్లు ఉండగా 1,200 మంది జనాభా నివసిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం పాలవలసలో ఒక ప్రైవేటు విద్యుత్ ప్లాంట్ యాజమాన్యం బయ్యవరంలో రైల్వే స్టేషన్‌కు సమీపంలో బొగ్గు నిల్వ చేసేందుకు యార్డును సుమారు పదేళ్ల కిందట ఏర్పాటు చేసుకుంది. మొదట్లో వారానికి రెండు గూడ్స్ రైళ్లలో మాత్రమే బొగ్గు నిల్వలు యార్డుకు వచ్చేవి. తరువాత కాలంలో ప్రతి రోజూ ఒకటి, రెండు గూడ్స్ రైళ్లలో సరకు రవాణా అవుతోంది. నిత్యం రాత్రి, పగలు తేడా లేకుండా బయ్యవరం యార్డు నుంచి కశింకోట, అనకాపల్లి, లంకెలపాలెం, పరవాడ మీదుగా 100 నుంచి 150 లారీల్లో ఇక్కడ నుంచి బొగ్గు నిల్వలు పెదగంట్యాడ మండలం పాలవలసలోని విద్యుత్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. నిత్యం యార్డులో లోడింగ్, అన్‌లోడింగ్ జరుగుతుండడంతో ఇటీవల కాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. బయ్యవరం యార్డు నుంచి ఎగిసిపడుతున్న నల్లబొగ్గు దుమ్ము, ధూళి వలన సమీపంలో పంట పొలాలు, తాగునీటి వనరులు సైతం కలుషితమవుతున్నాయి. రోడ్లపై నల్లటి బుగ్గి కుప్పలుగా పేరుకుపోతున్నాయి. సమీపంలోని ఇళ్ల శ్లాబులు, గోడలపై నల్లని బుగ్గి పొరలుగా ఏర్పడి అధ్వానంగా తయారవుతున్నాయి.
మూడు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు
బయ్యవరం యార్డులో నిత్యం బొగ్గు లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా జరుగుతుండడంతో సమీపంలోని బయ్యవరం, జమ్మాదులపాలెం, రామన్నపాలెం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నల్లని బుగ్గి ఎగసిపడుతుండడంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. బుగ్గి వల్ల చర్మ సంబంధిత వ్యాధులు, కళ్ల మంటలు, అస్తమా వస్తున్నాయని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో పలువురికి జరిపిన స్ర్కీనింగ్ పరీక్షల్లో ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు మరింత ఆందోళన చెందుతున్నారు. యార్డును ఇక్కడ నుంచి గ్రామాలకు దూరంగా తరలించాలని ఆయా గ్రామస్థులు అధికారులను వేడుకొంటున్నారు. ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పెదగంట్యాడ మండలంలో సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేటు పవర్ ప్లాంట్‌కు బొగ్గు రవాణా కోసం ప్రత్యేకంగా గూడ్స్ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కానీ సదరు సంస్థ గూడ్స్ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేసుకోకుండా కాలం వెల్లదీస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసిన బయ్యవరం గ్రామస్థులు సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. అనంతరం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.