Share News

మురికివాడలకు మహర్దశ

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:45 AM

మురికివాడ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది.

మురికివాడలకు మహర్దశ

వెలంపేట మోడల్‌లో అభివృద్ధికి ప్రతిపాదనలు

డీపీఆర్‌ సిద్ధం చేయనున్న ఏపీయూఐఏఎంఎల్‌

పీపీపీ విధానంలో అమలుకు త్వరలో టెండర్లు

జీవీఎంసీ అధికారుల నిర్ణయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మురికివాడ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలిదశలో అత్యంత దుర్భరంగా ఉన్న 14 మురికివాడలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు డీపీఆర్‌తోపాటు ఆర్‌ఎఫ్‌పీ పూర్తిచేసి, టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో వెలంపేటను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుని మరో 13 మురికివాడలను కూడా అభివృద్ధి చేయాలని జీవీఎంసీ అధికారులు భావిస్తున్నారు.

నగరంలోని 66 నోటిఫైడ్‌ మురికివాడలను అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోనే మురికివాడ రహిత తొలి నగరంగా గుర్తింపు సాధించాలని జీవీఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)లో ప్రణాళిక పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఏపీయూఐఏఎంఎల్‌)తో సంయుక్తంగా ముందుకువెళ్లాలని నిర్ణయించారు. ముందుగా పైలట్‌ ప్రాజెక్టుగా వన్‌టౌన్‌లోని వెలంపేటను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. దీనికోసం ఏపీయూఐఏఎంఎల్‌ సర్వేచేసి డీపీఆర్‌ను తయారుచేసి జీవీఎంసీకి అందజేసింది.

వెలంపేటలో...

సుమారు 49 సెంట్ల విస్తీర్ణం కలిగిన మురికివాడలో ప్రస్తుతం 177 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి, ఆ స్థలంలో అన్ని మౌలిక వసతులతో పక్కా భవనాలు నిర్మించి ఇచ్చేలా డీపీఆర్‌ను తయారుచేశారు. జీ+12 తరహాలో నిర్మించే భవనంలో 177 మందికి 400 చదరపు అడుగుల చొప్పున వైశాల్యం కలిగిన ఫ్లాట్‌లను ఉచితంగా నిర్మించి ఇస్తారు. భవన నిర్మాణం పూర్తయ్యేసరికి రెండేళ్లు పడుతుంది. కాబట్టి అంతవరకు నిర్వాసితులు అద్దె ఇళ్లలో నివసించేందుకు డెవలపర్‌ అద్దె భరించాల్సి ఉంటుంది. అభివృద్ధి చేసినందుకు డెవలపర్‌కు టీడీఆర్‌లను జారీచేస్తారు. దీనికి సంబంధించి టెండర్లు పిలిచే దశలో ఉండడంతో అత్యంత దుర్భరంగా ఉన్న మరో 13 మురికివాడలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలని జీవీఎంసీ నిర్ణయించింది. ఇప్పటికే దొండపర్తి సమీపంలోని ఇందిరానగర్‌ మురికివాడను అభివృద్ధి చేసేందుకు డీపీఆర్‌ సిద్ధమవ్వడంతో టెండరు ప్రిపరేషన్‌లో అధికారులున్నారు. ఇదే తరహాలో మరో 12 మురికివాడలను తీర్చిదిద్దేందుకు వీలుగా డీపీఆర్‌ తయారుచేయాలని ఏపీయూఐఏఎంఎల్‌ అధికారులను జీవీఎంసీ కోరింది. ఆయా మురికివాడల్లో సర్వే చేయడం, ఎలా అభివృద్ధి చేస్తే జీవీఎంసీపై ఆర్థికభారం పడకుండా నివాసితులకు, డెవలపర్‌కు మేలు జరుగుతుందనే దానిపై సర్వే చేసి, డీపీఆర్‌ను జీవీఎంసీకి అందజేస్తారని చెబుతున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 12:45 AM