Share News

వేరొకర్ని ఇష్టపడిందని..

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:23 AM

Mother kills married daughter అప్పటికే పెళ్లయిన ఆ యువతి వేరొకరిని ఇష్టపడింది. ఇది నచ్చని తల్లి ఇంటికి పిలిచి గొడవపడింది. ఈమెతో పాటు మరో ఇద్దరు కలిసి దాడి చేయడంతో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది.

వేరొకర్ని ఇష్టపడిందని..
హరిణి

పెళ్లయిన కూతురిని హత్య చేసిన తల్లి

మరో ఇద్దరు కుటుంబ సభ్యుల సాయంతో..

ఆత్మహత్యగా చిత్రీకరణ.. ఆలస్యంగా వెలుగులోకి

టెక్కలి మండలం సొర్లిగాంలో ఘటన

టెక్కలి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): అప్పటికే పెళ్లయిన ఆ యువతి వేరొకరిని ఇష్టపడింది. ఇది నచ్చని తల్లి ఇంటికి పిలిచి గొడవపడింది. ఈమెతో పాటు మరో ఇద్దరు కలిసి దాడి చేయడంతో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ సొర్లిగాం గ్రామానికి చెందిన హరిణి(24)ని 2020లో మేనమామ దుంపల దంతేశ్వరరావు అనే సచివాలయ ఉద్యోగికి ఇచ్చి తల్లిదండ్రులు పెళ్లిచేశారు. ఈ దంపతులకు గునాజ్ఞ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకుకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మ దగ్గర వదిలి హరిణి హైదరాబాద్‌లో గ్రూప్స్‌ కోచింగ్‌కు వెళ్లింది. అక్కడ హరిణికి మరో వ్యక్తితో రిలేషన్‌షిప్‌ ఏర్పడింది. అక్కడి నుంచి హరిణి తన మేనమామతో విడాకులు కావాలని తరచూ తల్లిదండ్రులను కోరుతుండేది. దీంతో హరిణి, తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతుండేవి. హైదరాబాద్‌లో ఒకటి, రెండుసార్లు వీరి తగాదాలు పోలీస్‌స్టేషన్‌ వరకు చేరాయి. చివరకు ఈ విషయమై రాజీ చేస్తామని తల్లి పైల విజయకుమారి, తండ్రి ఈశ్వరరావు, తాత బలుసాకులు హరిణిని పిలిపించి ఈనెల 1న సొర్లిగాంలో ఇంటి వద్ద గొడవపడ్డారు. ఈ తగాదాలో హరిణిపై వారు బలంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దీంతో హరిణి తల్లి విజయకుమారి తన కుమార్తె అర్ధరాత్రి పూట ఆత్మహత్యకు పాల్పడిందని ఏడుస్తూ గ్రామస్థులకు నమ్మబలికించింది. తెల్లవారుజామున 3గంటల సమయంలో హరిణికి దహనసంస్కారాలు కూడా చేశారు. అయితే హరిణి హైదరాబాద్‌లో ఉన్న ప్రియుడికి తాను రెండు, మూడురోజుల్లో రాకపోతే తన గురించి ఇక చూడకు అని సెల్‌ఫోన్‌లో మెసేజ్‌ పంపింది. దీంతో ప్రియుడు ఆ మెసేజ్‌ శక్తి టీంకు పంపించడంతో వ్యవహారం బయట పడింది. ఈనెల 6 నుంచి పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తూ హరిణిని తల్లి, తాతలతో పాటు మరికొందరిని విచారించారు. హరిణి హత్య బయటకు పొక్కడంతో వీఆర్‌వో రమేష్‌ టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. ఈ విషయమై సీఐ ఎ.విజయ్‌కుమార్‌ వద్ద ఆంధ్రజ్యోతి ప్రస్తావించగా హరిణి హత్యకు గురైందనే మాట వాస్తవమని, ఇందుకు సంబంధించిన వివరాలు బుధవారం వెల్లడిస్తామని తెలిపారు.

Updated Date - Jun 10 , 2026 | 12:23 AM