శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:21 AM
Employment opportunities with 'MSMEs' ‘రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా సాగుతోంది. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమల స్థాపనపై సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించార’ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. మంగళవారం పొందూరు మండలంలోని వీఆర్ గూడెంలో 30 ఎకరాల్లో రూ.10.45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం
‘ఎంఎస్‌ఎంఈ’లతో ఉపాధి అవకాశాలు
అభివృద్ధి, సంక్షేమం దిశగా పాలన
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
పొందూరు, జూన్ 9(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా సాగుతోంది. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమల స్థాపనపై సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించార’ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. మంగళవారం పొందూరు మండలంలోని వీఆర్ గూడెంలో 30 ఎకరాల్లో రూ.10.45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే రాపాక గ్రామంలో రూ.5.19 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి పాలన సాగుతోంది. వైసీపీ దుర్మార్గపు పాలనలో రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. మళ్లీ రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధించేలా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్.. పారిశ్రామికవేత్తలను ఒప్పించి.. పరిశ్రమలను నెలకొల్పేలా చర్యలు చేపడుతున్నారు. రోడ్లు కొత్తరూపు దాల్చాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం రహదారులు నిర్మించాం. అభివృద్ధి పనులతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించి రైతులకు అండగా నిలుస్తోంద’ని తెలిపారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఎంఎస్‌ఎంఈల స్థాపనతో పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యం. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయి. ప్రస్తుత కూటమి పాలనలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నా.. వైసీపీ నాయకులు దుర్మార్గపు విమర్శలు చేస్తూ అబాసుపాలవుతున్నార’ని తెలిపారు.
పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ ‘ రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. వీఆర్ గూడెంలో 30 ఎకరాల్లో నిర్మించనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేయడం శుభపరిణామం. త్వరితగతిన పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడతాం. ప్రతి గ్రామంలో రహదారుల నిర్మాణం.. మౌలిక వసతుల కల్పన.. అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయ’ని తెలిపారు. అనంతరం పలువురు బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను అందజేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రమాద ఘటన మృతులకు రెండు నిమిషాలపాటు సంతాపం తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్, ఆర్డీవో సాయి ప్రత్యూష, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు శ్రీరంగనాయకులు, మండల టీడీపీ అధ్యక్షుడు సీహెచ్ రామ్మోహన్, జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి బలగ శంకరభాస్కర్, మండల తెలుగుయువత అధ్యక్షుడు ఖండాపు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ విశ్వప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ అన్నెపు రాము, కూన సత్యనారాయణ, సువ్వారి మధు, బాడాన గిరి, చింతాడ కృష్ణవాసుదేవరావు, ఎ.విజయలక్ష్మి, బాడాన హారిక, లోలుగు వెంకట్, గురాల సుమంత్, వండాన మురళి, గాడు నారాయణరావు, సీహెచ్ వాసుదేవరావు పాల్గొన్నారు.