Share News

నగరం నుంచి తీరం.. 100 అడుగుల రోడ్డు

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:25 PM

100 feet of road to the coast ప్రజల సౌకర్యార్థం శ్రీకాకుళం నగరం నుంచి సముద్ర తీరానికి 8 కిలోమీటర్ల మేర 100 అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అధికారులను ఆదేశించారు.

నగరం నుంచి తీరం.. 100 అడుగుల రోడ్డు
వర్చువల్‌ విధానంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

  • నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం చేయండి

  • రెండు వారాల్లోగా కార్గిల్‌పార్క్‌ ప్రారంభం

  • ఏప్రిల్‌ నాటికి పలాస ఆర్వోబీ పూర్తి కావాల్సిందే

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఆదేశాలు

  • శ్రీకాకుళం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ప్రజల సౌకర్యార్థం శ్రీకాకుళం నగరం నుంచి సముద్ర తీరానికి 8 కిలోమీటర్ల మేర 100 అడుగుల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అధికారులను ఆదేశించారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో మంగళవారం ఆయన ఢిల్లీ నుంచి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో జిల్లాలోని ప్రాజెక్టులపై వర్చువల్‌ విధానంలో సమీక్ష నిర్వహించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ సముద్ర తీరానికి తక్కువ సమయంలో చేరుకునేలా, పర్యాటకానికి ఊతమిచ్చేలా 100 అడుగుల రహదారి డిజైన్‌, నివేదికను రూపొందించాలని ఆదేశించారు. బారువ బీచ్‌లోనూ పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ‘జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక పనులను ఈ నెలలోనే పూర్తిచేయాలి. శ్రీకాకుళం నగరంలోని కార్గిల్‌పార్క్‌ సుందరీకరణ పనులు పూర్తి చేసి, రెండు వారాల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి. ఇండిగో సంస్థ రూ.10కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో చేపట్టే శ్రీకూర్మం ఆలయ అభివృద్ధి పనులకు వెంటనే శంకుస్థాపన చేయాలి. పలాస-కాశీబుగ్గ రైల్వే ఫ్లైఓవర్‌ పనులు ఏప్రిల్‌ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు పూర్తి కావాల’ని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణాలపైనా అధికారులతో చర్చించారు. మూలపేట పోర్టు నిర్మాణానికి ఆటంకంగా ఉన్న 330 ఎకరాల సాల్ట్‌ ల్యాండ్‌ సమస్య పరిష్కారమైందని తెలిపారు. పోర్టు పనులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) ట్యాగ్‌ వచ్చిన నేపథ్యంలో.. దాని విశిష్టతను తెలియజేసేలా ప్రత్యేక సభ నిర్వహించాలని తెలిపారు. ఖాదీ కార్మికుల సంఘ భవనాన్ని ఆధునికీకరించాలని ఆదేశించారు.

Updated Date - Feb 03 , 2026 | 11:25 PM