Share News

పోలీసు శాఖ విభజనపై కసరత్తు పూర్తి

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:31 AM

జిల్లా పునర్విభజన నేపథ్యంలో పోలీసు శాఖను కూడా విభజించాల్సిన పరిస్థితి నెలకొంది. పరిపాలన సౌలభ్యం, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

పోలీసు శాఖ విభజనపై కసరత్తు పూర్తి
దర్శిలోని డీఎస్సీ కార్యాలయం

సబ్‌ డివిజన్‌గా దర్శి లేక అద్దంకి

గిద్దలూరు కేంద్రంగా కొత్తది ఏర్పాటు

దర్శి, మార్కాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లు అప్‌గ్రేడ్‌

కందుకూరు సబ్‌డివిజన్‌లోకి కొండపి సర్కిల్‌

సిద్ధమైన ప్రతిపాదనలు

ఒంగోలు క్రైం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పునర్విభజన నేపథ్యంలో పోలీసు శాఖను కూడా విభజించాల్సిన పరిస్థితి నెలకొంది. పరిపాలన సౌలభ్యం, ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో ప్రస్తుతం నాలుగు మార్కాపురం జిల్లాలోకి వెళ్లాయి. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను కలపడంతో ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రకాశంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక పోలీసు సబ్‌డివిజన్‌గా ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రకారం ఒంగోలు, సంతనూతలపాడు ఒంగోలు సబ్‌డివిజన్‌గానే ఉంటుంది. దర్శి, అద్దంకి నియోజకవర్గాలు దర్శి సబ్‌డివిజన్‌గా, కందుకూరు సబ్‌డివిజన్‌లో కొండపి, కందుకూరు నియోజకవర్గాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మార్కాపురం జిల్లాలో ప్రస్తుతం మార్కాపురం, కనిగిరి పోలీసు సబ్‌డివిజన్‌లు ఉన్నాయి. కొత్తగా గిద్దలూరును సబ్‌ డివిజన్‌ చేయాలని పోలీసు యంత్రాంగం భావిస్తోంది.

ఒంగోలు సబ్‌ డివిజన్‌ యథాతథం

ఒంగోలు సబ్‌ డివిజన్‌లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. అయితే పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలను నియోజకవర్గాలకు అనుగుణంగా మార్పులు చేయనున్నారు. ఉదాహరణకు ఇప్పటి వరకూ ఒంగోలు తాలూకాలో ఉన్న మద్దిరాలపాడును నాగులుప్పలపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నారు. దర్శి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేసి ఎస్‌హెచ్‌వోగా సీఐను నియమించనున్నారు. దర్శి రూరల్‌ సర్కిల్‌ కింద ప్రస్తుతం ఆ నియోజకవర్గంలోని అన్ని మండలాలను చేర్చనున్నారు. ఆప్రకారం గతంలో త్రిపురాంతకం సర్కిల్‌ పరిధిలో ఉన్న కురిచేడు, దొనకొండ పోలీసు స్టేషన్‌లు దర్శి రూరల్‌ పరిధిలోకి రానున్నాయి.

కందుకూరు సబ్‌డివిజన్‌లోకి కొండపి

కందుకూరు సబ్‌డివిజన్‌లోకి ప్రస్తుతం ఉన్న కొండపి సర్కిల్‌ను చేర్చారు. టంగుటూరు, సింగరాయకొండ పోలీసు స్టేషన్‌లను ఒంగోలు సబ్‌ డివిజన్‌లోనే ఉంచే అవకాశం ఉంది. అలా అయితేనే ఎలాంటి సమస్యలు ఉండవని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ ఒంగోలు సబ్‌డివిజన్‌ నుంచి టంగుటూరు, సింగరాయకొండలను తొలగించి కందుకూరులో కలిపే ప్రతిపాదన కూడా తయారు చేసినట్లు తెలిసింది. ఈ విషయంలోనూ ప్రజాప్రతినిధుల అభిప్రాయం కీలకం కానుంది.

దర్శి సబ్‌ డివిజన్‌పై చర్చ

ప్రస్తుతం ఉన్న దర్శి సబ్‌ డివిజన్‌ను యథాతథంగా కొనసాగిస్తారా? లేక అద్దంకికి మార్చుతారా? అన్న చర్చ సాగుతోంది. దర్శి సబ్‌ డివిజన్‌కు అద్దంకిగా పేరు మార్చి దర్శిలో ఉంచాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. దీనిపై ప్రజాప్రతినిధుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.

మార్కాపురం పోలీసు స్టేషన్‌ అప్‌గ్రేడ్‌

మార్కాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేసి అక్కడ ఎస్‌హెచ్‌వోగా ఇన్‌స్పెక్టర్‌ను నియమించి మార్కాపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను సర్కిల్‌ చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అదేవిధంగా త్రిపురాంతకం సర్కిల్‌లో పెద్దారవీడును చేర్చి దాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ఇలా పలు మార్పులు, చేర్పులతో పోలీసు అధికారులు ప్రతిపాదనలు చేశారు. వీటికి ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం లభిస్తే విభజన ప్రక్రియ పూర్తవుతుంది.

Updated Date - Jan 23 , 2026 | 02:31 AM