Share News

‘పది’పై ఫోకస్‌

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:16 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధన లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారులు ఇప్పటికే పాఠశాలల్లో 100రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు.

‘పది’పై ఫోకస్‌
గిద్దలూరులోని ఓ స్కూల్‌లో ప్రత్యేక తరగతుల్లో విద్యార్థినులు

100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

కలెక్టర్‌ రాజాబాబు ప్రత్యేక దృష్టి

విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం

ప్రతి హైస్కూల్‌కు ఒకరికి బాధ్యతలు

354 మంది అధికారుల నియామకం

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధన లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారులు ఇప్పటికే పాఠశాలల్లో 100రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు నిత్యం ఉదయం, సాయంత్రం రెండు గంటలపాటు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఆదివారాలతో సహా అన్ని రోజులూ ప్రత్యేక తరగతులకు హాజరుకావాల్సిందే. వీరికి ప్రతిరోజూ పరీక్షలు నిర్వహిస్తూ ఫైనల్‌ ఎగ్జామ్స్‌ భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసంతో హాజరయ్యేలా సన్నద్ధం చేస్తున్నారు.

ఒంగోలు విద్య, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : ప్రభు త్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యా ర్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఆ మేరకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. దానిపై కలెక్టర్‌ రాజాబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీనికోసం ప్రతి హైస్కూలుకు ఒక మండలస్థాయి గెజిటెడ్‌ అధికారిని పర్యవేక్షకులుగా నియమించారు. ఇలా మొత్తం 354 మందిని కేటాయించారు. ఇప్పటికే డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో పాఠశాలలను సందర్శిస్తున్నారు. వీరితోపాటు పర్యవేక్షణాధికారులుగా నియమితులైన వారు పాఠశాలలకు వెళ్లి మార్గనిర్దేశం చేస్తున్నారు.

వారానికి రెండుసార్లు సందర్శించాలి

పర్యవేక్షణాధికారులుగా నియమితులైన అధికారులు వారానికి కనీసం రెండు సార్లు పాఠశాలను సందర్శించి పిల్లల్లో స్ఫూర్తిని నింపాలి. విద్యాపరంగా వెనుకబడిన వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమీక్షించి విద్యార్థుల ప్రతిభ ప్రగతిని తెలుసుకోవాలి. రైజింగ్‌స్టార్స్‌ స్థానంలో ఉన్నవారిని షైనింగ్‌ స్టార్స్‌ స్థాయికి ఎదిగేలా చూడాలి. విద్యార్ధులకు నిర్వహించే రోజువారీ స్లిప్‌టెస్ట్‌లు, వారాంత పరీక్షలు, రివిజన్‌ టెస్టులు షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తున్నారా? జవాబుపత్రాలను దిద్దుతున్నారా? అన్నది పరిశీలించాలి. అధికారులు ప్రతి విద్యార్థి స్థాయిని గుర్తించి వెనుకబడిన వారికి రెమిడియట్‌ టీచింగ్‌, ప్రత్యేక తరగతులు, సందేహ నివృత్తి తరగతులు నిర్వహించేలా చూడాలి.

అంతా అప్రమత్తం చేయాలి

ప్రత్యేక తరగతులను విద్యార్థుల హాజరును కూడా ప్రత్యేకాధికారులు పరిశీలించనున్నారు. తరగతులకు గైర్హాజరవుతున్న వారిని గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రతిరోజూ క్రమంతప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చూడాల్సి ఉంది. పాఠశాలన్నింటిలో సంబంధిత క్లాసులు నిర్వహిస్తున్నారా? విద్యార్థుల ప్రగతి రిజిస్టర్లు నిర్వహిస్తున్నారా? అన్నది పరిశీలించాలి. తరగతి గది వాతావరణ, క్రమశిక్షణ, ఇతర అంశాలు పరిశీలించి ఏమైనా లోపాలుంటే వెంటనే డీఈవోకు తెలియజేయాలి. అధికారులు పాఠశాలల సందర్శనకు సంబంధించిన నివేదికలను సమర్పించాలి, 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో లోపాలని గుర్తించాలి. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. రోజువారీగా మండలస్థాయి అధికారులతో నిర్వహించే టెలికాన్ఫరెన్సుల్లో 10వతరగతి పిల్లల విషయం ప్రస్తావిస్తూ అధికారులను అలెర్ట్‌ చేసున్నారు.

Updated Date - Jan 25 , 2026 | 03:16 AM