వంగ రైతు బెంగ
ABN , Publish Date - Feb 21 , 2026 | 02:03 AM
వంగ సాగు చేసిన రైతులు బెంగ పడుతున్నారు. ఇటీవల వరకు పది కిలోలు రూ.300 వరకు ఉన్న వంకాయల ధర ప్రస్తుతం రూ.60కు పడిపోయింది. కిలో రూ.30 చొప్పున ధర ఉంటేనే సాగుచేసిన రైతులకు పెట్టుబ డులు వచ్చేది.
పది కిలోలు రూ.60
రోజురోజుకూ దిగజారుతున్న ధరలు
అద్దంకి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : వంగ సాగు చేసిన రైతులు బెంగ పడుతున్నారు. ఇటీవల వరకు పది కిలోలు రూ.300 వరకు ఉన్న వంకాయల ధర ప్రస్తుతం రూ.60కు పడిపోయింది. కిలో రూ.30 చొప్పున ధర ఉంటేనే సాగుచేసిన రైతులకు పెట్టుబ డులు వచ్చేది. కనీసం పది కిలోలు రూ.200 ఉండక పోతుందా అని రైతులు భావించారు. తీరా ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. ఈఏడాది వంగ దిగుబడులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ధరలు దిగజారాయి. దిగుబడులు వస్తున్నాయనుకున్న సమయంలో ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కోత కూలి, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని వారు వాపోతున్నారు. అద్దంకి, బల్లికురవ, కొరిశపాడు, సంతమాగులూరు, పంగులూరు మండలాలలో వంగ సాగును విస్తారంగా చేపట్టారు. ఈ ప్రాంతాల నుంచి వంకాయలు మార్టూరు మార్కెట్‌తోపాటు హైదరాబాద్‌కు కూడా ఎగుమతి చేస్తుంటారు. దీంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో పొలంలో వదిలివేయడమే మేలన్న భావనతో కొందరు కోతలు కూడా కోయడం లేదు. మరికొందరు గ్రామాల్లో తిరిగి సొంతంగా అమ్మకాలు చేసుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తే ఈఏడాది వంగ సాగు చేసిన వారు నిండా మునిగినట్టేనన్న విషయం అర్థమవుతోంది.