ఒంగోలులో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పీడీఆర్‌కు ఆమోదం
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:17 PM
ఒంగోలు నగరంలో సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు డిటైల్ ప్రాజెక్టు నివేదిక(పీడీఆర్)కు ఏకగ్రీవంగా ఆ మోదించారు. స్థానిక నగర పాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశం బుధవారం ఇన్‌చార్జి మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది.
నగర సమావేశపు అజెండాలోని అంశాలకు ఆమోదం
38వ డివిజన్‌లో పార్కు పేరు ప్రతిపాదన వాయిదా
జనసేన పార్టీ కార్పొరేటర్లు వాకౌట్
అన్ని పనులను పాదర్శకంగా చేస్తున్నామని ఎమ్మెల్యే దామచర్ల వెల్లడి
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరంలో సమగ్ర భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు డిటైల్ ప్రాజెక్టు నివేదిక(పీడీఆర్)కు ఏకగ్రీవంగా ఆ మోదించారు. స్థానిక నగర పాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశం బుధవారం ఇన్‌చార్జి మేయర్ వేమూరి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అజెండాలో మొత్తం 41 అంశాలు ఉండగా అందులో 40 అంశాలను సమావేశంలో ఆమోదించారు. ప్రధానంగా అజెండాలోని 38వ అంశాన్ని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు వాయిదా వేయాలని కోరారు. 38వ డివిజన్‌లోని మునిసిపల్ పార్కుకు ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని శ్రీకృష్ణదేవరాయ పార్కు పేరును ప్రతిపాదించారు. అయితే దీనిపై టీడీపీ కార్పొరేటర్లు రవితో పాటు పలువురు సభ్యులు ఆ ప్రాంత ప్రజల అభిప్రాయసేకరణ తీసుకున్న తర్వాత పెట్టాలని, అప్పటి వరకు ఆ అంశాన్ని వాయిదావేయాలని కోరారు. దీనిపై జనసేన పార్టీ కార్పొరేటర్ మునగా రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలో అనేక పార్కులకు ఎలాంటి చర్చ లేకుండానే పేర్లను ఆమోదించారని, ఈ పార్కుపై అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. దీంతో అక్కడ టీడీపీ, జనసేన కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ పార్కుకు పేరు పెట్టేందుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అప్పటికప్పుడు అజెండాలో చేర్చారని, దీనిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలిపారు. వెంటనే అజెండాలోని మరో అంశం చదువుతుండగా జనసేన పార్టీ కార్పొరేటర్ మునగా రమేష్ మైక్ ఇరగ్గొట్టి వాకౌట్ చేశారు. ఆయనతో పాటు ఇతర ఆ పార్టీ కార్పొరేటర్లు కూడా బయటకు వెళ్ళిపోయారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ నగరంలో దోమల నివారణ, తాగునీటి సమస్యలపై మాట్లాడగా టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ నగరంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి డివిజన్‌లో ఫాంగింగ్ పనులు చేపట్టడంతో పాటు అయిల్‌బాల్స్ కూడా వేస్తున్నట్లు తెలిపారు. పోతురాజు కాలువపై కూడా డ్రోన్లతో ఫాంగింగ్ చేసినట్లు చెప్పారు. అన్ని డివిజన్లలో పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని, అందువల్ల సందేహాలు ఉంటే ఎప్పుడైనా పరిశీలించుకోవచ్చని స్పష్టం చేశారు. నగరంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రెండు చెరువుల్లో 65నుంచి 70శాతం మేర నీరు నిల్వ ఉందని, రంగరాయుడు చెరువుతో పాటు మిగిలిన రెండు చెరువులను కూడా పూర్తి స్థాయిలో నింపతాఆమని చెప్పారు. అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని వివిధ అబివృద్ధి పనులకు సంబంధించిన ఆమోదించారు. కాగా నగర అభివృద్ధికి ఎమ్మెల్యే దామచర్ల చేస్తున్న కృషిని పలువురు కార్పొరేటర్లు అభినందించారు. సమావేశంలో నగర కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.