Share News

తరగతికో కొత్త విద్యార్థి

ABN , Publish Date - Jun 10 , 2026 | 01:10 AM

పాఠశాల విద్యలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని మెరిట్‌ విద్యార్థులను ఆకర్షించి ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఎత్తుకెళ్లేవి. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చింది.

తరగతికో కొత్త విద్యార్థి

ప్రైవేటు స్కూళ్ల నుంచి తీసుకురండి!

ప్రభుత్వ బడుల్లో చేర్చేందుకు టార్గెట్‌

లక్ష్యాలను నిర్దేశించిన విద్యాశాఖ

ఒంగోలువిద్య, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి) : పాఠశాల విద్యలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని మెరిట్‌ విద్యార్థులను ఆకర్షించి ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఎత్తుకెళ్లేవి. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫలితాలు సాధించి భళా అనిపించారు. జిల్లాలో 51 జడ్పీ హైస్కూళ్లలో పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. వ్యక్తిగత మార్కుల సాధనలోనూ ప్రైవేటు విద్యార్థులకు దీటుగా నిలిచారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కనీసం తరగతికో కొత్త విద్యార్థిని చేర్చాలని పాఠశాల విద్య అధికారులు లక్ష్యం నిర్దేశించారు. ప్రభుత్వ పాఠశా లల టీచర్లు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అడ్మిషన్ల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికారులు సైతం రోజూ టీచర్లు, హెచ్‌ఎంలతో వెబెక్స్‌ నిర్వహిస్తూ ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షించాలని సూచి స్తున్నారు. ప్రతి తరగతికి కనీసం ఒక్క కొత్త విద్యార్థి అయినా ప్రైవేటు నుంచి రాబట్టాలని ఆదేశాలు జారీచేస్తున్నారు. గతేడాది అడ్మిషన్ల కంటే ఈ ఏడాది కనీసం పదిశాతం పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు జిల్లాలో గతేడాది 1,04,093 మంది 1 నుంచి 10 తరగతుల్లో ఉండగా ఈ ఏడాది 10,410 మంది అదనంగా 1,14,503 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని చెప్పడంతో తదనుగుణంగా చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇప్పటివరకు 1,04,445 మందిని చేర్పించారు.

ఇంకా పది వేల మందిని చేర్చాలి

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఇంకా 10,058 మంది కొత్త విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంది. జిల్లాలో 1980 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల్లో 2,03,825 మంది చదువుతున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో 1,02,024మంది ఉన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2,444 మంది కలిపి 1,04,445 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 99,351మంది విద్యనభ్యసిస్తున్నారు దీంతో ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులను ఆకర్షించేందుకు హెచ్‌ఎంలు, టీచర్లు ఇంటింటి ప్రచారం కలిసివస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్కారు అందిస్తున్న విద్యామిత్ర కిట్లతోపాటు ఇతర సౌకర్యాలను వివరిస్తున్నారు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 1,300 మంది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు ముందుకొచ్చారు. వీరిలో 600 మంది ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో టీసీలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా మరో 674మంది చేరేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 01:10 AM