Share News

తలసరి ఆదాయం రూ.2,00,522

ABN , Publish Date - Mar 11 , 2026 | 11:43 PM

జిల్లా స్థూల ఉత్పత్తి(జీడీడీపీ) వృద్ది రేటులో జిల్లాలో పారిశ్రామిక, సేవా రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే.. వ్యవసాయ రంగంలో భారీగా తగ్గుదల కనిపించింది.

తలసరి ఆదాయం రూ.2,00,522
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న డాక్టర్‌ ఏ.సిరి

రాష్ట్రంలో 24వ స్థానంలో కర్నూలు జిల్లా

15వ స్థానంలో జిల్లా స్థూల ఉత్పత్తి

వ్యవసాయ రంగం నుంచి భారీగా తగ్గిన రాబడి

పారిశ్రామిక, సేవా రంగంలో ఆశాజనకంగా జీవిఏ

కర్నూలు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా స్థూల ఉత్పత్తి(జీడీడీపీ) వృద్ది రేటులో జిల్లాలో పారిశ్రామిక, సేవా రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే.. వ్యవసాయ రంగంలో భారీగా తగ్గుదల కనిపించింది. అధిక వర్షాలు, వ్యవసాయ ఉత్పత్తులను సరైన ధరలు లేకపోవడమే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీడీడీపీ సాధనలో జిల్లా 15వ ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే క్రమంలో జిల్లా తలసరి ఆధాయం కూడా ఆశించిన స్థాయిలో మెరుగైన స్థానం సాధించలేదు. గత ఏడాది రాష్ట్రంలో 23వ స్థానంలో ఉంటే ఈ ఏడాది జిల్లా తలసరి ఆధాయం రూ.2,00,522లతో 24వ స్థానానికి పడిపోయింది. బుధవారం సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా మంత్రి టీజీ భరత, కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి, ఎస్పీ విక్రాంతపాటిల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా జీడీడీపీలో ఏస్థాయిలో ఉన్నాం..? వివిధ రంగాల్లో సాధించిన పురోగతి ఎంత..? వంటి అంశాలపై ప్రభుత్వం విడుదల చేసిన నివేదికపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

ఫ 15వ స్థానంలో జిల్లా స్థూల ఉత్పత్తిః

జిల్లా ఆర్థికాభివృద్ధి ఏ స్థాయిలో ఉందో చెప్పే ప్రధాన సూచిక జిల్లా స్థూల ఉత్పత్తి(జీడీడీపీ). జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ) అంచనావేసే వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవల రంగం ద్వారా 2024-25లో రూ.52,762కోట్లు సాధించి రాష్ట్రంలో 15వ స్థానంలో కర్నూలు నిలిచింది. 14.68 శాతం పెరుగుదలను సాధించగా, తాజా ఆర్థిక సంవత్సరం 2025-26లో రూ.54,607 కోట్లతో 15శాతంతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే కాస్త మెరుగుదల అనిపించినా 3.5శాతం వృద్ధిరేటు మాత్రమే కనిపిస్తోంది. వ్యవసాయ రంగంలో గత ఏడాది రూ.18,164కోట్లు రాబట్టి 10వ ర్యాంకును సాధిస్తే, ఈ ఏడాది రూ.16,596కోట్లు రాబట్టి 16వ ర్యాంకుకు పడిపోయింది. ఇందుకు ప్రధాన కారణం అధిక వర్షాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడమేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిశ్రమల రంగంలో గత ఏడాది రూ.9,410కోట్లు రాబట్టి 13వ ర్యాంకులో నిలిచిన జిల్లా ఈ ఏడాది రూ.9,948కోట్లు రాబట్టి 14వ ర్యాంకుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సేవల రంగంలో 2024-25లో రూ.21,2247కోట్లతో 12వ ర్యాంకు సాధిస్తే, 2025-26లో రూ.23,795కోట్లతో 12వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే వృద్ధిరేటు గణనీయంగా తగ్గింది.

ఫ తలసరి ఏదీ..?

రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లా తలసరి ఆదాయంలో భారీగా వెనుకబడి ఉంది. 24వ ర్యాంకుతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే వృద్ధి రేటు కేవలం 2.98శాతం మాత్రమే. 2024-25లో జిల్లా తలసరి ఆదాయం రూ.1,94,723 లతో 23వ స్థానంలో ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరం రూ.2,00,522లతో 24వ స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. వ్యవసాయ రంగం భారీగా దెబ్బతినడమే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తోంది.

ఫ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో మెరుగు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా వచ్చిన ప్రజా ఫిర్యాదులు, సమస్యల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం ఆశాజనకమైన పురోగ తి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8,451 సమస్యలు వచ్చాయి. వాటిలో 562 సమస్యలను స్వీకరించి 479 సమస్యలు వెంట నే పరిష్కరించారు. 94 శాతం పురోగతి సాధించారు. వివిధ సమస్యలు 7,889 సమస్యలు రాగా అందులో 83శాతం సమస్యలు పరిష్కరించి రాష్ట్రంలో 13వ స్థానంలో నిలిచారు. వ్యక్తిగత సమస్యలు 2,321 రాగా ఇందులో 79 శాతం సమస్యలు పరిష్కరించారు.

ఫ ప్రజల సంతృప్తి 66.5 శాతం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ, అభివృద్ది పథకాలపై 66.5శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 33.5 శాతం ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేయడం కొసమెరుపు. అందులో అన్నా క్యాంటీన్ల అమలుపై 74.1శాతం, ఏపీఎ్‌సఆర్టీసీ సర్వీ్‌సల పై 64.7శాతం, మహిళలపై జరిగే నేరాల నివారణలో 62.9శాతం, మీ భూమి-మీ హక్కు అమలుపై 62.5శాతం ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అదే క్రమంలో గంజాయిని నిర్మూలించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కఠినంగా వ్యవహరిస్తుందని 64.2శాతం ప్రజలు వెల్లడించారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీలో 84.6శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం కొసమెరుపు. ఆర్వోఆర్‌ సర్వేలో ప్రజలు సంతృప్తిగా లేరు. ఏడాదిలో కేవలం 34.8శాతం మాత్రమే సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే గడిచిన డిసెంబర్‌ 25 నుంచి ఫిబ్రవరి 26వరకు కాస్త మెరుగ్గా 58.2శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా వివిధ పథకాల అమలుపై సరాసరి 66.5శాతం ప్రజలు సంతృప్తి చెందారు.

జిల్లాలో ఇదీ పరిస్థితిః

ఫ జిల్లాలో రూ.1,844 కోట్లతో ఎనిమిది జాతీయ రహదారుల ప్రాజెక్టులు జిల్లాకు వచ్చాయి. వీటి ద్వారా 105 కి.మీ ఎనహెచ రోడ్ల నిర్మాణం చేశారు. మరో 5.81 కి.మీ చేయాల్సి ఉంది. మరో 13.85 హెక్టార్లు భూ సేకరణ చేయాల్సి ఉంది.

ఫ కర్నూలు నగర శివార్లలోని దూపాడు రైల్వే స్టేషన నుంచి నంద్యాల జిల్లా బేతంచెర్లకు 53.9కి.మీ రైల్వేలైన నిర్మాణం కోసం డీపీఆర్‌ తయారీలో ఉంది. ఓర్వకల్లు ఇండసీ్ట్రయల్‌ క్లస్టర్‌ను కలుపుతూ ఈ రైల్వే నిర్మాణం చేయనున్నారు. జిల్లాకు 8 రైల్వే ప్రాజెక్టులు మంజూరు కాగా అందులో 5 ప్రాజె క్టులో ప్రారంభ దశలోనే ఉన్నాయి.

ఫ జిల్లాలో రూ.2465.02 కోట్లతో చేపట్టే మూడు భారీ పరిశ్రమలకు ఎస్‌ఐపీబీ అప్రూవల్‌ ఇచ్చింది. ఈ పరిశ్రమలు ప్రారంభమయితే 19వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే భూ కేటాయింపులు కూడా చేశారు. అలాగే రూ.645 కోట్లతో ప్రారంభించే మరో నాలుగు పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయు చేసుకుంది. ఈ పరిశ్రమలు వస్తే 1678 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

ఫ జిల్లాలో రూ.17,186 కోట్లతో చేపట్టబోయే ఏడు పవర్‌ విద్యుత ఉత్పత్తి ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 6,980మందికి ఉద్యోగాలు రానున్నాయి. నాలుగు పరిశ్రమలకు భూ కేటాయింపులు చేయాల్సి ఉంటే మూడు పరిశ్రమలకు ఇప్పటికే భూ కేటాయింపులు చేశారు. మరో ఐదు పవర్‌ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎంఓయు చేసుకుంది. రూ.16,993కోట్లతో చేపట్టే ఈ పవర్‌ ప్రాజెక్టుల ద్వారా 5,104 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Updated Date - Mar 11 , 2026 | 11:43 PM