ఆక్రమణలపై బుల్డోజర్
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:15 AM
మంత్రాలయంలో రియల్ దందా ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేశారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన రెవెన్యూ అధికారులు మంగళవారం బుల్డోజర్లతో ఆక్రమణలు తొలగించారు. వైసీపీ కీలక నాయకుడి అనుచరులుగా చలామణి అవుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఆ పార్టీ నాయకులు రెవెన్యూ అధికారుల చర్యలను అడ్డుకున్నారు.
మంత్రాలయంలో ప్రభుత్వ భూముల కబ్జా
యంత్రాలతో ప్రహరీని తొలగించిన అధికారులు
కర్నూలు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయంలో రియల్ దందా ఆగడాలకు అధికారులు అడ్డుకట్ట వేశారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన రెవెన్యూ అధికారులు మంగళవారం బుల్డోజర్లతో ఆక్రమణలు తొలగించారు. వైసీపీ కీలక నాయకుడి అనుచరులుగా చలామణి అవుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఆ పార్టీ నాయకులు రెవెన్యూ అధికారుల చర్యలను అడ్డుకున్నారు. మంత్రాలయం మండలం నాగులదిన్నె రోడ్డు వైపున సర్వే నంబరు.178/1లో ప్రభుత్వ వంక పోరంబోకు భూమి 1.11 ఎకరాలు (111 సెంట్లు) ఉంటే, ఏకంగా 0.92 సెంట్లు కబ్జా చేసి ప్రైవేటు వెంచర్లలో కలిపేసుకున్నారు. స్థానిక బహిరంగ మార్కెట్ ధర ప్రకారం కబ్జాకు గురైన వంక పోరంబోకు భూమి విలువ రూ.7-10 కోట్లు వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు. గత నెల 11న తహశీల్దారు రమాదేవి కబ్జాదారులకు నోటీసులు జారీ చేసింది. అయినా.. వారిలో ఏమాత్రం చలనం లేదు. అంతేకాదు.. తుంగభద్ర నది బఫర్ జోన్లో సైతం వైసీపీ బడా నాయకులు కొందరు అక్రమ లే అవుట్లు వేసి ప్లాట్ల అమ్మకాలకు పెట్టారు. ఈ భాగోతాలను వరుక కథనాలతో ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది.
ఈ నేపథ్యంలో కబ్జా చేసి ప్రైవేట్ వెంచర్‌లో కలిపేసిన ప్రభుత్వ వంక పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మించిన ప్రహరీని తహసీల్దార్ రమాదేవి ఆదేశాల మేరకు ఆర్‌ఐ జనార్ధన్‌రావు, మంత్రాలయం వీఆర్‌వో భీమన్నగౌడ్, వీఆర్‌ఏ నరసప్ప తదితరులు ఎక్స్‌కవేటర్లతో తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. కొంతభాగం కూల్చేశారు. ఈ విషయం తెలుసుకున్న కబ్జాదారులు సూగూరుకు చెందిన జి.హనుమన్న, బూదూరుకు చెందిన జక్కయ్యలు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. దీంతో వారు కూల్చేవేతను ఆపేసి వెళ్లిపోయారు. కబ్జాదారులు అక్కడితో ఆగకుండా కబ్జాదారులు మండల రెవిన్యూ కార్యాలయానికి చేరుకొని తహసీల్దారు రమాదేవితో ‘మా వెంచర్లలో గోడలను ఎలా కూల్చేస్తారు’ అంటూ వాగ్వాదానికి దిగారు.