పులి చర్మాల కేసులో ముగ్గురికి జైలు శిక్ష
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:16 AM
మార్కాపురం జిల్లా పరిధిలోని దోర్నాల మండలం ఐనముక్కల గ్రామంలో 12ఏళ్ల క్రితం పులి చర్మాలు పట్టుబడిన కేసులో ముగ్గురికి మార్కాపురం జిల్లా అదనపు సెషన్స్ కోర్టు న్యాయాధికారి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమాన విధించారు.
12 ఏళ్ల పాటు కొనసాగిన విచారణ
ఆత్మకూరు, జూన్ 9(ఆంధ్రజ్యోతి): మార్కాపురం జిల్లా పరిధిలోని దోర్నాల మండలం ఐనముక్కల గ్రామంలో 12ఏళ్ల క్రితం పులి చర్మాలు పట్టుబడిన కేసులో ముగ్గురికి మార్కాపురం జిల్లా అదనపు సెషన్స్ కోర్టు న్యాయాధికారి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమాన విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నే్‌షఅప్పావ్ వెల్లడించారు. ఆత్మకూరు మండలంలోని సిద్దాపురం గ్రామానికి చెందిన వేముల నాగేశ్వరరావు, అప్పటి ప్రకాశం జిల్లా, దోర్నాల మండలం, ఐనముక్కల గ్రామానికి చెందిన గుంగుమల విజయ్‌బాబు, గంగుమల చిట్టిబాటు అనే ముగ్గురు నిందితులు 2014లో రెండు పులులను వేటాడి వాటి చర్మాలు, గోర్లను సేకరించారు. ఆ తర్వాత వాటిని ఐనముక్కల గ్రామంలోని చిట్టిబాబు అనే వ్యక్తి ఇంట్లో ఉంచారు. ఆత్మకూరు ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందం పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. వారి నుంచి పులి చర్మాలు, గోర్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో నిందితులపై కేసు నమోదు చేసి మార్కాపురం ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరు నిందితులకు రిమాండ్ విధించారు. తర్వాత కేసు విచారణ భాగంగా పూర్వాపరాలను తెలుసుకున్న మెజిస్ర్టేట్ 2020లో ముగ్గురు నిందితులకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధించారు. దీనిపై నిందితులు మార్కాపురం అదనపు జిల్లా సెషన్స్ కోర్టుకు అప్పిల్‌కు వెళ్లగా 2026 జూన్ 8న సోమవారం అప్పిల్‌ను కొట్టివేస్తూ గతంలో విధించిన శిక్షనే సమర్థించి మెజిస్ర్టేట్ తీర్పునిచ్చారు. దీంతో ముగ్గురు నిందితులను మంగళవారం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
బలమైన సాక్ష్యాలతోనే నిందితులకు జైలు శిక్ష
పులి చర్మాల కేసులో పట్టుబడిన ముగ్గురు నిందితులు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. సాక్షులు సైతం తమ వాంగ్మూలం నుంచి వెనక్కి తగ్గినప్పటికీ బలమైన ప్రత్యక్ష, ధ్రువీకరణ సాక్షాధారాలు, పంచనామ వివరాలతో నిందితులకు శిక్ష పడటంలో అటవీ అధికారులు కీలకంగా వ్యవహరించారు. ప్రత్యేకించి పులిచర్మంపై ఉన్న బుల్లెట్ రంధ్రాన్ని నిర్ధారించే ఫోరెన్సిక్ నివేదికలో ఏ1 వద్ద లభించిన ఆయుధానికి మ్యాచ్ అయింది. దీంతో పాటు ముగ్గురి నిందితుల సెల్ టవర్ లొకేషన్, కాల్స్ డేటా తదితర ఆధారాలను కోర్టులో సమర్పించడంలో నిందితులు తప్పించుకోలేకపోయారు.