లోకేశ్ ఏమైనా పుడింగా?
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:51 AM
మంత్రి లోకేశ్, పోలీసులపై వైసీపీ నేత జోగి రమేశ్ మరోసారి నోరు పారేసుకున్నారు. ‘‘లోకేశ్‌కు చిప్ దొబ్బిందని అనకూడదా? అందులో ఏం తప్పుంది? ఆయనేమైనా పుడింగా? మర్యాద నేర్చుకోవాలి’’ అంటూ దురుసు వ్యాఖ్యలు చేశారు.
చిప్ దొబ్బిందంటే తప్పేంటి?
రెడ్‌బుక్‌ను మడిచి పెట్టుకో
మళ్లీ నోరు పారేసుకున్న జోగి రమేశ్
నాకేమైనా జరిగితే లోకేశ్‌దే బాధ్యత
పోలీసులు, కొన్ని పత్రికలది రాక్షసానందం: జోగి వ్యాఖ్యలు
విజయవాడ/ ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : మంత్రి లోకేశ్, పోలీసులపై వైసీపీ నేత జోగి రమేశ్ మరోసారి నోరు పారేసుకున్నారు. ‘‘లోకేశ్‌కు చిప్ దొబ్బిందని అనకూడదా? అందులో ఏం తప్పుంది? ఆయనేమైనా పుడింగా? మర్యాద నేర్చుకోవాలి’’ అంటూ దురుసు వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్‌ను మడిచి పెట్టుకోవాలంటూ దూకుడు ప్రదర్శించారు. తనకేమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత లోకేశ్‌దేనన్నారు. సోమవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లోకేశ్ ఆదేశాలతోనే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. ‘‘లోకేశ్.. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో.. నా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం’’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిపై దాడి ఘటన పట్ల పోలీసులు, కొన్ని పత్రికలు రాక్షసానందం పొందుతున్నాయన్నారు. ‘‘రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తూ వందలమంది కార్యకర్తలను నా ఇంటిపైకి లోకేశ్ పంపారు. పథకం ప్రకారం నన్ను మట్టుబెట్టాలని చూశారు’’ అని ఆరోపించారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. పోలీసులను దేవుడు ఏదో రూపంలో శిక్షిస్తాడంటూ శాపనార్థాలు పెట్టారు. చంద్రబాబుకు జై.. అనాలనుకుంటే డ్రస్ వదిలేసి పచ్చచొక్కాలు వేసుకోవాలన్నారు. పోలీసులు, టీడీపీ నేతలు కలిసే తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. ఆ సమయంలో ఒక్క పోలీస్ చేతిలో అయినా లాఠీ ఉందా అనిప్రశ్నించారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.