Share News

ఎన్జీటీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:48 AM

నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత ఉంటుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

ఎన్జీటీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం

  • నెల్లూరు జిల్లా సిలికా మైనింగ్‌ వ్యవహారంలో హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

  • ఎన్జీటీ నిర్ణయాలపై హైకోర్టునూ ఆశ్రయించవచ్చు

  • వ్యాజ్యాలకు విచారణార్హత ఉంటుంది

అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత ఉంటుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్జీటీ చట్టంలోని సెక్షన్‌ 22 ప్రకారం ఆ సంస్థ నిర్ణయాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉన్నప్పటికీ.. బాధితుడు హైకోర్టుకు కూడా రావచ్చని పేర్కొంది. నెల్లూరు జిల్లా మోమిడి గ్రామంలో సిలికా మైనింగ్‌కు పర్యావరణ అనుమతులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వుల్లో జ్యోక్యం చేసుకోబోమని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం ఇటీవల తీర్పునిస్తూ పైవ్యాఖ్యలు చేసింది. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో సిలికా మైనింగ్‌కు శ్రీకుమారస్వామి సిలికా మైన్స్‌ సంస్థకు అధికారులు 2020 ఏప్రిల్‌ 16న పర్యావరణ అనుమతులు ఇచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ ఆ గ్రామానికి చెందిన మదన్‌కుమార్‌రెడ్డి చెన్నైలోని ఎన్జీటీలో అప్పీల్‌ చేశారు. విచారించిన ఎన్జీటీ.. పర్యావరణ అనుమతులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ 2021 నవంబరు 15న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ సిలికా మైన్స్‌ సంస్థ 2021 డిసెంబరులో హైకోర్టులో రిట్‌ వేసింది. మదన్‌కుమార్‌రెడ్డి బాధితుడు కానందున కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన పర్యావరణ అనుమతులను ఎన్జీటీలో సవాల్‌ చేయలేరన్నారు. మదన్‌కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అన్ని అంశాలను పరిశీలించాకే ఎన్జీటీ ఈసీని నిలుపుదల చేసిందన్నారు. పిటిషనర్‌ స్థానిక గ్రామస్తుడని, పర్యావరణ అనుమతులు కారణంగా బాధితుడిగా మారినందున ఎన్జీటీలో అప్పీల్‌ వేసే అర్హత ఆయనకు ఉందన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం. ఎన్జీటీ ఉత్తర్వులు సరైనవేనని స్పష్టం చేసింది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయన్న మైనింగ్‌ సంస్థ వాదనను తోసిపుచ్చింది. ఎన్జీటీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఎన్జీటీ ఉత్తర్వులకు అనుగుణంగా ఈసీ జారీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పులు, చట్ట నిబంధనలు అనుసరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Updated Date - Jan 21 , 2026 | 04:43 AM