మెమో ఇచ్చినా ససేమిరా!
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:41 AM
నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు విషయంలో ప్రభుత్వం మెమో ఇచ్చినా కూడా ఉమ్మడి కృష్ణాజిల్లాలో రెవెన్యూ అధికారులు సీరియస్‌గా తీసుకోవడంలేదు. జీవోలు ఇస్తే తప్ప తాము చొరవ చూపలేమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో నిషేధిత భూముల సమస్యలు తీరక ప్రజలు ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపులో అలక్ష్యం
- ఉమ్మడి కృష్ణాలో 22ఏ జాబితాలో లక్షన్నరకు పైగా అసైన్డ్ పట్టాలు
- వీటిలో చేతులు మారనివి ముప్పై వేలపైనే..
- భూ సమస్యల పరిష్కారానికి ఇటీవల మెమో జారీ చేసిన ప్రభుత్వం
- జీవో కావాలంటూ అడుగు ముందుకు వేయని రెవెన్యూ అధికారులు
- దీంతో పీవోటీ చట్టం సెక్షన్ 6 మినహాయింపులను అందుకోలేకపోతున్న పేదలు
- అపరిష్కృతంగానే మాజీ సైనిక ఉద్యోగుల సమస్యలు
నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు విషయంలో ప్రభుత్వం మెమో ఇచ్చినా కూడా ఉమ్మడి కృష్ణాజిల్లాలో రెవెన్యూ అధికారులు సీరియస్‌గా తీసుకోవడంలేదు. జీవోలు ఇస్తే తప్ప తాము చొరవ చూపలేమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో నిషేధిత భూముల సమస్యలు తీరక ప్రజలు ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ప్రజల నుంచి నిషేధిత భూముల విషయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)కు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అర్జీదారులకు సంతృప్తిని కలిగించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం చాలా స్పష్టంగా జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి ఎవరెవరు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలో ఇటీవల ఓ మెమో జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన మెమోను క్షేత్రస్థాయిలో అమలు చేసే విషయంలో ఎన్టీఆర్, కృష్ణాజిల్లా రెవెన్యూ యంత్రాంగాలు క్రియాశీలకంగా వ్యవహరించటం లేదు. నిషేధిత భూముల విషయంలో వ్యవహరించాల్సిన పద్ధతులను పాటించడం లేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అసైన్డ్ భూములు, షరతుల గల పట్టాలకు సంబంధించి భూముల్లో సింహభాగం నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. పీవోటీ చట్టం సెక్షన్-6 ఇచ్చిన మినహాయింపుల ప్రకారం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ ఇళ్ల పట్టాలు, సాగు పట్టాలకు సంబంధించి నిర్ణీత కాలం పూర్తయ్యాక వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని ఉంది. ఇది పీవోటీ చట్టం ఇచ్చిన మినహాయింపు. ఈ మినహాయింపులను రెవెన్యూ శాఖ విధిగా అమలు చేయాలి. కానీ నిషేధిత భూముల జాబితా రాగం అందుకుంటూ.. చట్టపరంగా అర్హత కలిగిన వాటికి కూడా మోక్షం కల్పించటం లేదు.
లక్షన్నరకు పైనే..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో లక్షన్నకు పైగా అసైన్డ్ పట్టాలు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పీవోటీ చట్టం సెక్షన్-6 నిర్దేశించిన మినహాయింపులను చూస్తే.. ప్రభుత్వం ఎవరైతే పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ ఇళ్ల స్థలాల్లోనే పదేళ్లకుపైగా ఆవాసం ఉంటూ ఉండాలి. ఎలాంటి చేతులు మారకుండా పట్టాదారులే ఉండాలి. అలాంటి వారికే యాజమాన్య హక్కులు కల్పించే మినహాయింపు వర్తిస్తుంది. ఇదే విధంగా సాగు పట్టాలు ఇచ్చిన వారు కూడా ఎవరికీ క్రయ, విక్రయాలు జరపకుండా 20 ఏళ్ల పాటు వారే కనుక సాగు చేస్తూ ఉంటే వారికి కూడా యాజమాన్య హక్కులు కల్పించాల్సి ఉంది. ఇలాంటి అర్హతలు కలిగిన వాటికి సంబంధించి ప్రీహోల్డ్‌లో పెట్టినా.. చట్ట ప్రకారం చెల్లదు. న్యాయ స్థానాలను ఆశ్రయించిన ఉదంతాలను చూస్తే తీర్పులు కూడా లబ్ధిదారులకు అనుకూలంగానే వస్తున్నాయి. కోర్టులు ఇస్తున్న తీర్పుల కారణంగా.. గిఫ్ట్ డీడ్స్ వంటి రిజిస్ర్టేషన్లు కూడా జరుగుతున్నాయి. దీని వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతోంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు వంటి వాటికి వీటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకోవటానికి దోహదపడుతోంది. నిబంధనలకు అనుగుణంగా, చట్టపరంగా పరిష్కరించాల్సిన వాటిని కూడా రెండు జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగాలు సీరియస్‌గా తీసుకోకపోవటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మెమో కాదు.. జీఓ ఇవ్వాలన్న ఆలోచన కరెక్టేనా ?
నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపునకు సంబంధించి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎవరు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి అన్న దానిపై మెమోలో పేర్కొంది. అయినా కూడా రెవెన్యూ అధికారులు జీవో రాలేదని చెబుతున్నారు. జీవో ఇస్తే అధీకృతంగా ఉంటుందని, మరింతగా ముందుకు వెళ్లగలమన్న వాదనలను తీసుకువస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మెమో కూడా ఉత్తర్వులుగానే పరిగణించవచ్చు. మెమో ప్రకారం అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునేలా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా.. ఆ పని చేయటం లేదు.
- ఆధార పత్రాల పరిగణనపై కూడా స్పష్టత
మెమో ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు చూస్తే నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపునకు సంబంధించి నిర్దిష్టమైన ఆధార పత్రాలను పరిగణనలోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అసైన్‌మెంట్ మాస్టర్ రిజిస్టర్స్ పరిశీలన చేయటం ద్వారా అవి అసైన్డ్ పట్టాలా ? కావా ? అసైన్డ్ అయిన వారేనా ? అన్న విషయాలను నిర్ధారించుకోవచ్చు. అసైన్‌మెంట్ రిజిస్టర్స్, పాత ఇతర రికార్డులు, డీఆర్ ఫైళ్లు వంటివి పరిశీలన చేయవచ్చు. ఆధారం కోసం వీటిలో ఏదైనా ఒకటి ఉన్నా పర్లేదు. ఇంత స్పష్టంగా ఇచ్చినా అధికారులు ధైర్యం చేయటం లేదు.
సైనికుల ఇళ్ల పట్టాల విషయంలోనూ..
మాజీ సైనికులకు పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కింద కేటాయించిన భూముల విషయంలో కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించటానికి ప్రభుత్వం మెమో ద్వారా స్పష్టమైన అంశాలను పొందుపరిచింది. కేటాయింపునకు సంబంధించి మెమో నెంబర్ 3.1లో సూచించిన విధంగా అసైన్‌మెంట్ మాస్టర్ రిజిస్టర్, జిల్లా సైనికాధికారి చేసిన భూమి కేటాయింపు సిఫార్సుల రిజిస్టర్, అసైన్‌మెంట్ రిజిస్టర్స్, రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్ (ఆర్‌వోహెచ్), డీకేటీ పట్టాలు, 8ఏ రిజిస్ర్టేషన్ పత్రాలు, ఇతర పాత రికార్డులు ఏవైనా ఒకటి ఉంటే సరిపోతుంది. అయినా మెమోను పాటించకుండా మాజీ సైనికోద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారు.