తుక్కు వాహనాల సిండి‘కేట్’!
ABN , Publish Date - Jan 23 , 2026 | 01:33 AM
పాత.. పనిచేయని ప్రభుత్వ వాహనాల వేలం వద్దకు దాదాపు వంద మంది వచ్చారు. వీరిలో 16 మంది రూ.5 వేల చొప్పున టెండరు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వేలంలో పాల్గొన్నది ఏడుగురే.
(చిత్తూరు రూరల్, ఆంధ్రజ్యోతి)
పాత.. పనిచేయని ప్రభుత్వ వాహనాల వేలం వద్దకు దాదాపు వంద మంది వచ్చారు. వీరిలో 16 మంది రూ.5 వేల చొప్పున టెండరు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, వేలంలో పాల్గొన్నది ఏడుగురే.
అధికారులు నిర్ణయించిన ధర కన్నా కేవలం రూ.3 వేలు అధికంగా కోట్ చేసి వాహనాలను సొంతం చేసుకున్నారు. ఇక, వేలంలో పాల్గొనేందుకు టెండర్ల దాఖలుకు బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు గడువు ఉండగా 12 గంటలకే వేలం వేయడం సహా అన్నీ జరిగిపోయాయి.
‘స్ర్కాప్’ (తుక్కు) వ్యాపారులు సిండికేట్ అయ్యారనడానికి ఈ రెండు పరిణామాలను నిదర్శనంగా పేర్కొనవచ్చు. నిర్ణీత సమయానికన్నా ముందే వేలం ముగించడంపైనా అధికారులపై విమర్శలు వస్తున్నాయి.
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పాతబడ్డ ఆరు 108 వాహనాలు, మూడు 104 వాహనాలను బుధవారం వేలం వేస్తున్నట్లు డీఎంహెచ్‌వో సుధారాణి ప్రకటించారు. వీటిలో 108, 104 వాహనాలకు రెండేసి చొప్పున నాలుగింటికి ఇంజన్లు లేవు. వీటికి రూ.25 వేలు చొప్పున.. ఇంజన్లున్న మిగిలిన ఐదింటికి రూ.30 వేల చొప్పున రవాణాశాఖ ధరను నిర్ణయించింది. ప్రభుత్వాస్పత్రి ఆవరణలో బుధవారం నిర్వహించిన వేలం పాటకు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచీ సుమారు వంద మంది హాజరయ్యారు. వీరంతా సిండికేట్‌గా మారి కేవలం 16 మంది మాత్రమే వేలంపాటలో పాల్గొనేలా దరఖాస్తు చేసుకున్నారు. అందులోనూ ఏడుగురే వేలంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా కేవలం రూ.2 వేల నుంచి రూ.3 వేలు అధికంగా చెల్లించి వాహనాలను కైవసం చేసుకున్నారు. మిగతా తొమ్మిది మంది మౌనంగా ఉండిపోయారు. ఇక, వేలం వేసిన వాహనాల విలువను తగ్గించి చూపారన్న విమర్శలున్నాయి. కిలోల లెక్క విక్రయించిన ఒక్కో వాహనానికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వచ్చేదని అంటున్నారు. టైర్లు బాగుండటం, రిపేరు చేస్తే కొన్ని వాహనాలను రన్నింగ్‌లోకి తేవచ్చని పలువురు అంటున్నారు. ఇక, స్ర్కాప్ వ్యాపారులు ఎక్కడ వేలంపాట జరిగినా ఇదే మాదిరిగా సండికేట్‌గా మారుతుంటారన్న ఆరోపణలున్నాయి.
సిండికేట్ల మధ్య రెండో వేలంపాట!
వాహనాలను కైవసం చేసుకున్నాక బుధవారం రాత్రే స్ర్కాప్ వ్యాపారులంతా ఒకచోట చేరి రెండో వేలం పాట నిర్వహించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఇందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధరను పక్కన పెట్టి దానిపై రూ.2 లక్షల నుంచి వేలం పాట మొదలుపెట్టారు. అందులో ఒకరు వేలంపాటను కైవసం చేసుకొని ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులతో పాటు వారి మధ్య జరిగిన వేలం పాట డబ్బులు చెల్లించి 9 వాహనాలను కైవసం చేసుకున్నారు. ప్రభుత్వానికి కటాల్సిన డబ్బులపైన వచ్చే మొత్తాన్ని మిగిలిన వారు పంచుకుంటారు. దీనిపై కలెక్టర్, ఎస్పీ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వాహనాల ఇంజన్లు తీసుకెళ్లిందెవరు?
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అవరణలో ఉంచిన పాతబడ్డ వాహనాల్లో రెండు 108, రెండు 104 వాహనాలకు ఇంజన్లు మాయమయ్యాయి. నిత్యం ప్రజలు సంచరించే ప్రదేశంలో నుంచి ఇంజన్లను ఎవరు మాయం చేశారనేది అందరితో వ్యక్తమవుతున్న ప్రశ్న. ఆ ఇంజన్లు ఎవరు తీసుకెళ్లారనేది అధికారులు విచారించకుండా, వాటినీ వేలంలో వేలంలో విక్రయించడం గమనార్హం.