ఎబోలా వైర్‌సపై అప్రమత్తం
ABN , Publish Date - May 25 , 2026 | 01:10 AM
ప్రభుత్వ ఆదేశాలతో ఎబోలా వైర్‌సపై జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతానికి ప్రజలు భయపడాల్సిన అవసరం లేకపోయినా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తిరుపతి సెంట్రల్, మే 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాలతో ఎబోలా వైర్‌సపై జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతానికి ప్రజలు భయపడాల్సిన అవసరం లేకపోయినా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ సూచనలతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఇలాంటి లక్షణాలున్న వారు ఎవ్వరూ లేరన్నారు. అయితే ఉగాండా, కాంగో, సూడాన్ నుంచి తిరుమల, తిరుపతికి వచ్చేవారి పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా తిరుపతి విమానాశ్రయంపై దృష్టి పెట్టామన్నారు. రెండ్రోజుల్లో విమానాశ్రయ, ఆరోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రుయా ఆస్పత్రిలో 15 బెడ్ల సామర్థ్యంతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. అనుమానిత లక్షణాలున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి. మాస్కు, గ్లోవ్స్ ధరించాలి. విదేశాల నుంచి వచ్చేవారికి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. జ్వరం, వాంతులు, రక్తస్రావ లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.