Share News

Vintage Coffee MD Balakrishna: 1,100 కోట్లతో కాఫీ ప్లాంట్‌

ABN , Publish Date - Dec 10 , 2025 | 03:44 AM

తెలంగాణలో రూ.1,100 కోట్లతో కాఫీ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు.. కాఫీ రంగంలో తనదైన ముద్ర వేసిన ‘వింటేజ్‌ కాఫీ’ సంస్థ ప్రకటించింది.....

Vintage Coffee MD Balakrishna: 1,100 కోట్లతో కాఫీ ప్లాంట్‌

  • ఆంధ్ర జ్యోతితో వింటేజ్‌ కాఫీ ఎండీ బాలకృష్ణ

  • ఫ్రీజ్‌ కాఫీ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రూ.1,100 కోట్లతో కాఫీ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు.. కాఫీ రంగంలో తనదైన ముద్ర వేసిన ‘వింటేజ్‌ కాఫీ’ సంస్థ ప్రకటించింది. సంస్థ విస్తరణ ప్రణాళిక గురించి వింటేజ్‌ కాఫీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) బాలకృష్ణ కీలక విషయాలు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ‘ఆంధ్రజ్యోతి’కిప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశ, విదేశీ పెట్టుబడుల విషయంలో గ్లోబల్‌ సమ్మిట్‌ మైల్‌ స్టోన్‌లా నిలుస్తుందని కితాబిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనువైన ప్రదేశమని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో సానుకూల దృక్పథంతో ఉన్నారని, పరిశ్రమ స్థాపన విషయంలో ఎలాంటి సమస్య వచ్చినా, ఏ సహకారం కావాలన్నా తనను సంప్రదించాలని సూచించారని చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఏదైనా ఆలోచన చెబితే సానుకూలంగా తీసుకుంటున్నారని ప్రశంసించారు. సీఎంను కలిశాక పారిశ్రామికవేత్తల్లోనూ నమ్మకం ఏర్పడిందని చెప్పారు.

ఫోర్త్‌ సిటీ మంచి ఆలోచన

హైదరాబాద్‌ మహానగరం ఒకవైపే కాకుండా అన్నివైపులకు విస్తరించేందుకు ఫోర్త్‌సిటీ ఏర్పాటు మంచి ఆలోచన అని బాలకృష్ణ ప్రశంసించారు. త్వరలోనే ఫోర్త్‌సిటీ హైదరాబాద్‌తో కలిసిపోతుందని అభిప్రాయపడ్డారు. ‘మేము 25 ఏళ్ల నుంచి కాఫీ రంగంలో ఉన్నాం. తెలంగాణలో రూ.1,100 కోట్ల పెట్టుబడితో ఫ్రీజ్‌ డ్రైడ్‌ కాఫీ ప్లాంట్‌ను పెట్టబోతున్నాం. ఈ పద్ధతిలో మైనస్‌ 55 డిగ్రీల దగ్గర కాఫీ గింజలను ఫ్రీజ్‌ చేస్తాం. అందులో కాఫీ కంటెంట్‌ మాత్రమే ఉంచి.. వాటర్‌ మొత్తాన్ని బయటకు తీస్తాం. దీనివల్ల కాఫీలో ఉన్న అరోమా (సువాసన) బయటకు పోదు. కాఫీలో ఇది సూపర్‌ ప్రీమియం కాఫీ. ఇలాంటి ప్లాంట్‌ తెలంగాణలో ఇదే మొదటిది. దేశంలో నాలుగోది’ అని వివరించారు.

Updated Date - Dec 10 , 2025 | 03:44 AM