Share News

Venkaiah Naidu: జవసత్వాలతోనే వారసత్వం సాధ్యం

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:19 AM

వారసత్వం అంటే తండ్రి సంపాదించిన ఆస్తులను పంచుకోవడం కాదని, వారసత్వం అందుకోవాలంటే నిజమైన జవసత్వాలు పొందగలిగినపుడే సాధ్యమవుతుందని మాజీ ఉప....

Venkaiah Naidu: జవసత్వాలతోనే వారసత్వం సాధ్యం

  • తండ్రి ఆస్తులు పంచుకోవడం కాదు

  • జానమద్ది శతజయంత్యుత్సవంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కడప (మారుతీనగర్‌), నవంబరు 2(ఆంధ్రజ్యోతి): వారసత్వం అంటే తండ్రి సంపాదించిన ఆస్తులను పంచుకోవడం కాదని, వారసత్వం అందుకోవాలంటే నిజమైన జవసత్వాలు పొందగలిగినపుడే సాధ్యమవుతుందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కడపలో సీపీ బ్రౌన్‌ గ్రంథాలయ నిర్మాణకర్త డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి శత జయంత్యుత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. జానమద్ది చాలా మంచి గొప్ప వ్యక్తి అని, సీపీ బ్రౌన్‌ గ్రంథాలయాన్ని నిర్మించేందుకు ఒక యజ్ఞం లాగా ఆయన తపించారని తెలిపారు. ‘‘ఒక విదేశీయుడు(సీపీ బ్రౌన్‌) మన రాష్ట్రానికి వచ్చి, మన తెలుగు భాష కోసం కృషి చేశారు. ఆ మహోన్నతుడికి శత కోటి అభినందనలు. బ్రౌన్‌ గ్రంథాలయాన్ని సందర్శించాలని చాలా కాలంగా అనుకున్నా.. ఇప్పటికి ఆ భాగ్యం కలిగింది. ప్రతి ఊరికి ఒక దేవాలయం, విద్యాలయం, సేవాలయం, గ్రంథాలయం నెలకొల్పేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ముఖ్యంగా దేశ సమైక్యతకు, దేశ అభివృద్ధికి, విలువలను కాపాడేందుకు.. నేటి యువత కీలకపాత్ర పోషించాలి. మాతృభాషలోనే పాఠ్యాంశాలు, ఉత్తర్వులు, ప్రత్యుత్తరాలతో పాటు న్యాయవాదులు కూడా తెలుగులోనే వాదించాలి. ప్రధాని మోదీ కూడా ఉన్నత విద్యను మాతృ భాషలోనే అందించే ఆలోచనలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో కొంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది.’’ అని తెలిపారు. అనంతరం ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, అవధాన సరస్వతి మేడసాని మోహన్‌, లక్షలాది గ్రంథాల సంరక్షకుడు మరె అంకెగౌడ, ప్రముఖ సాహితీవేత్త రేవూరు ఆనందపద్మనాభలకు జానమద్ది పురస్కారాలు అందజేశారు.

Updated Date - Nov 03 , 2025 | 03:19 AM