Local Flavors to Global Summit Guests: గ్లోబల్ అతిథులకు లోకల్ రుచులు
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:40 AM
గ్లోబల్ సమ్మిట్‌కు విచ్చేసిన దేశ, విదేశీ అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంప్రదాయ వంటకాల రుచి చూపించింది. ప్రతి అతిథికి ప్రత్యేకంగా రూపొందించిన ఫుడ్ బాస్కెట్‌ను....
తెలంగాణ రుచులతో అతిథులకు బాస్కెట్లు పంపిణీ.. అలరించిన కీరవాణి సంగీతం
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): గ్లోబల్ సమ్మిట్‌కు విచ్చేసిన దేశ, విదేశీ అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంప్రదాయ వంటకాల రుచి చూపించింది. ప్రతి అతిథికి ప్రత్యేకంగా రూపొందించిన ఫుడ్ బాస్కెట్‌ను అందించింది. దీనిలో ఆదిలాబాద్‌లోని ఆదివాసీలు చేతితో తయారుచేసిన ఇప్పపువ్వు లడ్డూలు, హైదరాబాద్‌లోని హుస్సేనీ కుటుంబం దాదాపు 200 ఏళ్లుగా చేస్తూ వస్తున్న బాదం కీ జలీ, గ్రామీణ స్వయం సహాయక మహిళా బృందాలు స్వయంగా వండిన సకినాలు, చెక్కలు, నువ్వుల ఉండలు, మక్కపేలాల వంటివి ఉన్నాయి. ఈ వంటకాలను ప్రత్యేక సీసాలలో పెట్టి, అందమైన బాస్కెట్‌లో అందించారు. అంతేకాకుండా ఆ వంటకాల విశిష్టతను అతిథులకు తెలిపేలా వివరాలను కూడా ముద్రించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి తెలిపేందుకు ఇది ఓ మార్గమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఫుడ్ బాస్కెట్‌లోని రుచులు అతిఽథులకు నచ్చితే, వారు తెలంగాణలోని 10 వేలకు పైగా స్వయం సహాయక మహిళా బృందాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవడమే కాకుండా, సరికొత్త వ్యాపార భాగస్వామ్యాల ప్రారంభానికినాంది అవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
బాస్కెట్‌లోని ప్రత్యేక రుచులు ఇవే..
బాదం కీ జలీ: ఇది హైదరాబాదీ ప్రత్యేక తియ్యదనం. అజీజ్‌బాగ్‌లో ఉండే హుస్సేనీ కుటుంబం కోడళ్లు 200ఏళ్లుగా ఈ వంటకం తయారుచేస్తున్నారు. బాదం, జీడిపప్పు, పంచదార, యాలకులతోచేసే బాదంకీ జలీ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.
చెక్కలు: కరకరలాడే ఈ చెక్కలను 30 మంది స్థానిక మహిళలు స్వయంగా తయారుచేశారు. బియ్యంపిండి, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, శనగపప్పు కలిపి నూనెలో వేయించే ఈ చెక్కలను ప్రయాణ సమయంలో కూడా హాయిగా తినేయచ్చు.
ఇప్పపువ్వు లడ్డు: ఆదిలాబాద్ జిల్లాలోని గోండు తెగకు చెందిన 75 మంది ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డూలు ప్రత్యేకంగా చేతితో తయారుచేసి సదస్సుకు పంపారు.
మక్క పేలాలు: కామారెడ్డిలో ఎక్కువగా కనిపించే సంప్రదాయ స్నాక్ ఇది. అక్కడ నుంచే నేరుగా ఈ సదస్సుకు మక్క పేలాలు తీసుకువచ్చారు. వర్షాకాలంలో ఈ మక్క పేలాలు ఎక్కువగా కనిపిస్తాయి.
నువ్వుల ఉండలు: నువ్వులు, బెల్లంతో తయారుచేసే సంప్రదాయ స్వీట్ ఇది. ఈ లడ్డూలు సహజసిద్ధంగా శక్తిని అందిస్తాయి. చలికాలంలో శరీరానికి వెచ్చదనమూ అందిస్తుంది ఈ లడ్డు.
సకినాలు: ఇది కరీంనగర్ సంప్రదాయ వంటకం. సకినాలు.. తెలంగాణ రైజింగ్ సదస్సుఅతిథులకు పండుగ రుచులనుఅందించాయి. ఛాయ్ లేదంటే కాఫీతో కలిపి తీసుకుంటే అద్భుతమేనట!
అతిథులకు గాలా డిన్నర్
సమ్మిట్‌కు వచ్చిన అతిథులకు గాలాడిన్నర్ పేరుతో విందు ఏర్పాటుచేశారు. ఇందులో మటన్, నాటుకోడి మాంసంతో ప్రత్యేకంగా హైదరాబాద్ స్టైల్‌లో వంటకాలు చేయించారు. పలు దేశాల ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు గాలా డిన్నర్‌లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పలు అంశాలతో కూడిన కళా ప్రదర్శనలు నిర్వహించారు.
మారుమోగిన అందెశ్రీ పాట
సమ్మిట్‌లో ప్రపంచ దిగ్గజ వ్యాపారులు, ప్రముఖుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ... జననీ జయ కేతనం అంటూ మారుమోగింది. దీంతో గ్లోబల్ సమ్మిట్‌ను వీక్షించిన ప్రజలంతా అందెశ్రీని స్మరించుకున్నారు. ‘అందెశ్రీ... నీ పాటకు ప్రపంచం లేచి నిలుచున్నది’ అని సోషల్ మీడియాలో సందేశం చక్కర్లు కొట్టింది. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రైజింగ్ గీతం ఆకట్టుకుంది. ‘తెలంగాణ రైజింగ్ ేస్టట్ ఈజ్ సో షైనింగ్.. ఇట్స్ జస్ట్ అమేజింగ్, ది ఫ్యూచర్ ఈజ్ బిల్డింగ్’ అంటూ సాగిన గీతం అతిథులకు ఉత్సాహం కలిగించింది.
మైమరిపించిన కీరవాణి సంగీతం
సమ్మిట్‌లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి తన అద్భుతసంగీత విభావరితో అతిథులను మైమరిపించారు. ఒకవైపు గాలా డిన్నర్‌లో ఇష్టమైన వంటకాల రుచిని ఆస్వాదిస్తూ, మరోవైపు సంగీత విభావరి, మిరుమిట్లు గోలిపే వెలుగులను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గాయకుడు రాహుల్ సింప్లిగంజ్.. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరిచ్చిన డబ్బుతోనే ఘనంగా పెళ్లి చేసుకున్నాను.. రేవంతన్నా.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను’ అని అన్నారు.