Global Summit: నగరంలో.. సమ్మిట్.. సంబురం
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:48 AM
హైదరాబాద్ నగరంలో గ్లోబల్ సమ్మిట్ సందడి నెలకొంది. ఈ సండర్భంగా ప్రధాన కూడళ్లు, ఇతర ఏరియాల్లో సమ్మిట్‌కు సంబంధించిన హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హజరవడంతో వారిని ఆకర్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
- దేశ, విదేశీ ప్రతినిధుల రాక
- తెలంగాణ సంస్కృతితో ఆహ్వానం
- నయా నగర నిర్మాణానికి మేధోమథనం
- భవిష్యత్ ప్రాజెక్టులపై నిష్ణాతులతో చర్చాగోష్ఠులు
- పెట్టుబడులే లక్ష్యంగా కీలక ఒప్పందాలు
- ఆకట్టుకున్న అత్యాధునిక టెక్నాలజీ హంగులు
హైదరాబాద్: రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. మరో నయా నగర నిర్మాణానికి బాటలు వేస్తోంది. ఇందులో భాగంగా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’(Telangana Rising Global Summit)ను రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్కాన్‌పేట - బేగరికంచలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. సోమవారం నయా నగర నిర్మాణానికి ఆర్థిక మేధోమథనం జరిగింది.
ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ ఎంఎన్‌సీల ప్రతినిధులతో పాటు ఇన్నోవేటర్లు, పాలసీ మేకర్లు, ప్రముఖలతో చర్చాగోష్ఠులు చేపట్టింది. సదస్సుకు తొలిరోజు దాదాపుగా 2వేల మందికిపైగా అతిథులు హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమ్మిట్‌ను ప్రారంభించి ప్రసంగించారు. ఉదయం 11 గంటల నుంచి అతిథుల రాక ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, కె. కేశవరావు, రంగారెడ్డి జిల్లా నుంచి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు.

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా..
వీవీఐపీ పారిశ్రామికవేత్తలకు డీఎస్పీ స్థాయి అధికారితో భద్రతా కల్పించారు. వీవీఐపీ పారిశ్రామికవేత్తలకు, సీనియర్ అధికారులకు ప్రత్యేకంగా యాక్సెస్ పాస్‌లు జారీచేశారు. సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతినిధులను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీ హంగులు, రంగురంగుల జెండా మేళవింపుతో స్వాగతం పలికారు. అడుగడుగునా చారిత్రాత్మక కట్టడాల నమూనాలు, పర్యాటక ప్రదేశాలను భారీ స్ర్కీన్లతో ప్రదర్శించారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బేగరికంచ వరకు విద్యుత్ దీపాలంకరణలతో కటౌట్లు, ప్లెక్సీలు, భారీ ప్రొజెక్టర్లతో ప్రదర్శించారు.
56 గ్రామాల్లో అనువుగా..
ఈ సందర్భంగా 2047 విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ర్టాన్ని మూడు జోన్లుగా విభజించినట్టు వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో గ్రీన్ అగ్రికల్చర్, మహిళలు, యువతకు స్కిల్, ఐటీ, ఫార్మా, విద్య, వైద్యం, పర్యాటకం తదితర సంస్థలను నెలకొల్పే విజన్‌తో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మొత్తం 56 గ్రామాల్లో భూములు అనువుగా ఉన్నచోట ఒక్కో సంస్థను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.

అతిథులకు అంతరాయం కలగకుండా..
సమ్మిట్‌కు హాజరయ్యే అతిథుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఏడు ప్రాంతాల్లో పార్కింగ్ జోన్‌లను ఏర్పాటు చేశారు. అతిథులు ఎక్కడ తమ వాహనాలను పార్క్ చేయాలన్న సమాచారంతో కూడిన పాస్‌లు వారికి అందజేశారు. ప్రతీ పార్కింగ్ ఏరియాకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ కేటాయించారు.
కోడ్‌ను స్కాన్ చేయడంతో ఆయా పార్కింగ్ స్థలాలకు వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. వీవీఐపీలు, వీఐపీలు వస్తున్న వాహనాలకు అంతరాయం కలగకుండా పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించి, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీర్కాపేట్‌లోని సమ్మిట్ జరిగే ప్రాంతం వరకు వేలాది వాహనాలు తరలిరావడంతో, అడుగడుగునా పోలీసులను అందుబాటులో ఉంచారు.
15 ఈవీ బస్సులు నడిపిన ఆర్టీసీ
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఆవరణ వరకు ఆర్టీసీ 15 ఎలక్ర్టిక్ బస్సులను నడిపింది. కారు పార్కింగ్ ప్రాంతం నుంచి సమ్మిట్ ప్రాంగణానికి విదేశీ ప్రతినిధులతోపాటు పలువురిని స్టాల్స్ సమీపంలోకి తీసుకువెళ్లేందుకు బస్సులు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
నగరం సుందరంగా ముస్తాబు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు తగ్గట్టుగానే భాగ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరంలో పలు ప్రదేశాల్లో కళ్లు జిగేల్ మనేలా ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. సచివాలయాన్ని జాతీయ పతాకం, ఎల్‌ఈడీ లైట్లతో కూడిన రంగులతో అద్భుతంగా ముస్తాబు చేశారు. ట్యాంక్‌బండ్‌పై కూడా లైటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు
Read Latest Telangana News and National News