Tummala Nageswara Rao: దేశానికి పామాయిల్ హబ్‌గా తెలంగాణ
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:28 AM
ప్రస్తుతం 3 లక్షల ఎకరాల మేర ఉన్న పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యమని, దేశానికి పామాయిల్ హబ్‌గా తెలంగాణను...
10 లక్షల ఎకరాల్లో సాగే లక్ష్యం: మంత్రి తుమ్మల
గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం 3 లక్షల ఎకరాల మేర ఉన్న పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యమని, దేశానికి పామాయిల్ హబ్‌గా తెలంగాణను తయారు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గోద్రెజ్ కంపెనీ ఎండీ రాకేశ్ స్వామి, గోద్రెజ్ ఆగ్రో వెట్ లిమిటెడ్ సీఈవో సౌగత్ నియోగి, ఆయిల్ పామ్ బిజినెస్ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులతో చర్చ సందర్భంగా రాష్ట్రంలో పామాయిల్ సాగు పురోగతిని తుమ్మల వివరించారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం రెండేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేశామని, ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ రంగం గ్రోత్ ఇంజిన్‌గా మారుతోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధన, వైవిధ్యం మెరుగుదల, వాతావరణ-స్థితిస్థాపక సాగు పద్ధతులపై దృష్టి సారించేందుకు వీలుగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. థాయిలాండ్‌కు చెందిన ఆయిల్‌పామ్ విత్తన ఉత్పత్తి సంస్థ యూనివానిచ్ సహకారంతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ - ఓపీజీ, మలేషియాలోని ఎస్‌డీ గుత్రీ సంస్థ సహకారం కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పాదకతకు మద్దతు, వాతావరణ-స్థితిస్థాపక సంకర జాతుల సృష్టి, వ్యవసాయదారులను మరింత విస్తృతంగా శక్తివంతం చేయడం తమ లక్ష్యమని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.