Sridhar Babu: కృష్ణా, గోదావరిలో నీటివాటా కోసం పోరాటం
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:44 AM
కృష్ణా, గోదావరి నీటిలో తెలంగాణ వాటా దక్కేవరకు కాంగ్రెస్ ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరిలో తెలంగాణ నీటివాటాను కేంద్రప్రభుత్వం త్వరగా తేల్చాలని అన్నారు.
ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా మేడిగడ్డ ప్రాజెక్టు
బీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్పులకు ప్రతినెలా రూ.6వేల కోట్లు వడ్డీ
కరీంనగర్‌లో విలేకరులతో మంత్రి శ్రీధర్‌బాబు
కరీంనగర్ అర్బన్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నీటిలో తెలంగాణ వాటా దక్కేవరకు కాంగ్రెస్ ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరిలో తెలంగాణ నీటివాటాను కేంద్రప్రభుత్వం త్వరగా తేల్చాలని అన్నారు. ఇచ్చంపల్లి, తుమ్మిడిహెట్టితో పాటు గోదావరి, కృష్ణానదుల జలాలతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించే ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని కోరారు. మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ఏ విధానాన్ని అంగీకరించబోమని అన్నారు. తెలంగాణ వాటా నీటి చివరిబొట్టు వరకు నిలువ చేసేందుకు ప్రాజెక్టులకు అనుమతి వచ్చాక, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఏ జలాలతో.. ఏ పేరుతో.. ఏ ప్రాజెక్టు నిర్మించుకుంటారో వారిష్టమని చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రమే కారణమని, చైనాతో అంక్షలతో ముందస్తుగా సరైన విధానం అవలంభించకపోవటంతో ఈ సమస్య తలెత్తిందని అన్నారు.
ప్రస్తుతం వచ్చిన యూరియా రైతులకు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నామని, కొన్ని చోట్ల కావాలని కొందరు కృత్రిమ కొరతతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసును సిట్ లేదా సీబీఐతో విచారణ జరుపుతామని, దాంతో అసలు దోషులు, వారికి సహకరించిన నాటి ప్రభుత్వ పెద్దలు బయటికి వస్తారని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రూ. లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా రూ. ఆరు వేల కోట్లు వడ్డీ, అసలు రూపంలో చెల్లిస్తున్నామని చెప్పారు. డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిలువచేయాలా, మరమ్మతులు చేయాలా అనేది నిర్ణయిస్తామన్నారు. అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించేలా మేడిగడ్డ ప్రాజెక్టు ఉంటుందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.