Share News

Central Minister Kishan Reddy: మోదీ హయాంలో తెలంగాణకు 13 లక్షల కోట్లు

ABN , Publish Date - Dec 07 , 2025 | 06:29 AM

ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో తెలంగాణకు కేంద్రం వివిధ అభివృద్ధి పనుల పేరిట రూ.13లక్షల కోట్లు వెచ్చించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Central Minister Kishan Reddy: మోదీ హయాంలో తెలంగాణకు 13 లక్షల కోట్లు

  • గ్రామాల అభివృద్ధికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వెచ్చించిన నిధుల లెక్కలు చెప్పాలి

  • ఓట్ల కోసం వస్తున్న ఆ పార్టీ నాయకులను నిలదీయాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

భువనగిరి టౌన్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో తెలంగాణకు కేంద్రం వివిధ అభివృద్ధి పనుల పేరిట రూ.13లక్షల కోట్లు వెచ్చించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. జాతీయ రహదారులు, రైలు మార్గాలు, మెట్రో తదితర అభివృద్ధి పనులతో తెలంగాణ ముఖచిత్రం మారిందని చెప్పారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి 12 ఏళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు వెచ్చించిన నిధుల లెక్కలు చెప్పాలని సవాల్‌ విసిరారు. ప్రధాని మోదీ కొన్నేళ్లుగా నిధులను నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారని, దీంతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. దేశంలోనే అత్యధికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన హీనచరిత్ర బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లదని ఆయన ఆరోపించారు. ఓట్ల కోసం వస్తున్న ఆ పార్టీ నాయకులను గ్రామస్తులు నిలదీయాలన్నారు. ఫిరాయింపులపై కోర్టుల ఆదేశాలు, విచారణ పేరిట రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న జాప్యంపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలని చెప్పారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అభివృద్ధి పనులు తుది దశకు వచ్చాయని, మూడు నెలల్లో ప్రధాని మోదీ ఎయిమ్స్‌ సేవలను జాతికి అంకితం చేయనున్నారన్నారు. వరంగల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పనులు 60 శాతం, కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ పనులు 80శాతం పూర్తయ్యాయని చెప్పారు. తెలంగాణను రెండు పార్టీలు కలిసి అప్పుల పాలు చేశాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణాలు మినహా ఏ ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేదని చెప్పారు. కాగా దక్షిణాఫ్రికాలో కిడ్నా్‌పకు గురైన యాదాద్రి జిల్లా బండ సోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్‌ కుటుంబ సభ్యులను భువనగిరిలో కిషన్‌రెడ్డి కలిసి మాట్లాడారు. విదేశాంగ శాఖకు వివరాలు పంపి క్షేమంగా రప్పిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Dec 07 , 2025 | 06:30 AM