A tipper truck from Lakkadaram: వేకువ జామునే గమ్యస్థానానికి చేరుకోవాలని!
ABN , Publish Date - Nov 04 , 2025 | 02:50 AM
ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారం నుంచి బయలుదేరింది. ఇక్కడి బేతోల్....
ఓవర్‌లోడ్, ఓవర్ స్పీడ్‌తో వెళ్లడం వల్లే..
పటాన్‌చెరు రూరల్, నవంబర్ 3 (ఆంధ్రజ్యోతి): ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారం నుంచి బయలుదేరింది. ఇక్కడి బేతోల్ ఎస్‌ఎంఎస్ క్వారీలో కంకర లోడ్ చేసుకుని బయలుదేరిన టిప్పర్.. కాసేపట్లో గమ్యస్థానానికి చేరుతుందనగా బస్సును ఢీ కొట్టింది. సాధారణంగా ఈ తరహా టిప్పర్‌లో 30టన్నులు తీసుకెళ్లాల్సి ఉండగా.. ఓవర్ లోడ్‌తో టిప్పర్ బయలుదేరినట్లు తెలిసింది. వాస్తవానికి లక్డారంలో పెద్ద ఎత్తున క్రషర్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి వందల సంఖ్యలో టిప్పర్లు వేకువజామునే బయలుదేరి అధికారులు విధులకు హాజరు కాకముందే తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఓవర్ స్పీడ్‌తో వెళ్తుంటాయి. ఓవర్‌స్పీడ్, ఓవర్‌లోడ్ వల్లే తాజా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి మండలం హనుమాన్ తండాకు చెందిన టిప్పర్ యజమాని హనుమంతు సైతం ప్రమాద సమయంలో టిప్పర్‌లోనే ఉన్నారు. ప్రమాదంలో డ్రైవర్ మృత్యువాత పడగా, టిప్పర్ యజమానికి గాయాలయ్యాయి. కాగా, ప్రమాద వార్త తెలియగానే లక్డారంలోని క్రషర్ల యజమానులందరూ తాళాలు వేసి వెళ్లిపోయారు.