Share News

Accidents Continue Despite Past Tragedies: కిక్కిరిసిన ప్రయాణాలు.. ప్రమాదంలో ప్రాణాలు!

ABN , Publish Date - Nov 04 , 2025 | 02:56 AM

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ప్రయాణం సురక్షితమని ఆ సంస్థ చెబుతున్నా.. ప్రయాణికులకు భద్రతకు భరోసా ఇవ్వలేని పరిస్థితి నెలకొంటోంది......

Accidents Continue Despite Past Tragedies: కిక్కిరిసిన ప్రయాణాలు.. ప్రమాదంలో ప్రాణాలు!

  • ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి జనంతో సమస్యలు

  • కొండగట్టు ప్రమాదం తర్వాతా పాఠాలు నేర్వని ఆర్టీసీ

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ప్రయాణం సురక్షితమని ఆ సంస్థ చెబుతున్నా.. ప్రయాణికులకు భద్రతకు భరోసా ఇవ్వలేని పరిస్థితి నెలకొంటోంది. పరిమితికి మించిన ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పలుమార్లు భారీగా ప్రాణ నష్టానికి కారణం అవుతున్నాయి. బస్సుల సీట్ల సామర్థ్యం 40-45 వరకు ఉంటే.. 60 నుంచి 120 మంది ప్రయాణికులు ఉంటున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ రోడ్డులో 2018లో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 70 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దుర్ఘటన సమయంలో బస్సులో 108 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ ఘోర ప్రమాదం తర్వాత కూడా ఆర్టీసీ పాఠాలు నేర్వలేదు. తాజాగా సోమవారం ఉదయం చేవెళ్ల సమీపంలో జరిగిన ప్రమాద సమయంలోనూ బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇటీవల జగిత్యాల నుంచి నిర్మల్‌కు 150 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అధిక బరువు కారణంగా టైర్లు ఓడిపోయు రోడ్డుపై కుప్పకూలడం గమనార్హం.

సరిపడ బస్సులు లేకపోవడంతోనే..

హైదరాబాద్‌ సిటీ బస్సులతోపాటు జిల్లా సర్వీసులలోనూ నిత్యం పరిమితికి మించి ప్రయాణికులు ఉంటున్నారు. ప్రయాణికుల రద్దీ మేరకు ఆర్టీసీ బస్సుల్ని సమకూర్చుకోకపోడం, వచ్చిన బస్సు వదిలేస్తే మరో బస్సు ఎప్పుడు వస్తుందోనన్న ఆందోళనతో ఎక్కువ మంది ఎక్కుతుండటమే దీనికి కారణం. బస్సు డ్రైవర్‌, కండక్టరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కూడా ప్రయాణికులు వినకపోవడమూ కారణమే. గతంలో ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 45-50 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు సగటున 60లక్షల మందికిపైగా ప్రయాణిస్తున్నారు. కానీ ఆ మేరకు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరగలేదు. ఉన్నవాటిలో చాలా బస్సులు పాతబడిపోయాయి. కొత్త బస్సులు సమకూర్చుకోవడంపై ఇటీవల ఆర్టీసీ దృష్టి సారించినా అది నత్తనడకనే సాగుతోంది. ఆర్టీసీ బస్సులు ఢీకొనడం, ఇతర ప్రమాదాలకు సంబంధించి 2024-25లో 754 ప్రమాదాలు జరగ్గా 315 మంది మరణించారు, 704 గాయపడ్డారు. 2025-26 సెప్టెంబరు నాటికి 374 ప్రమాదాల్లో 154 మృతిచెందగా 413 మంది గాయపడ్డారు.


ఒకే ఒక్క బస్సు సీజ్‌..

తెలంగాణవ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికుల్ని తరలిస్తున్నారు. తరచూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ రవాణా శాఖ ఆర్టీసీపై ఒకేఒక్క కేసు నమోదు చేయడం గమనార్హం. జూలైలో జగిత్యాల నుంచి 112 మందితో పెగడపల్లికి వెళ్తున్న ఓ బస్సును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసి నిబంధనలు పాటించడం లేదని సీజ్‌ చేసారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులపై నమోదైన, సీజ్‌ చేసిన కేసు ఇదొక్కటే.

ఊపిరాడకనే చాలా మంది మృతి: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

టిప్పర్‌ అతివేగమే చేవెళ్ల వద్ద బస్సు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ అతివేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగంతోపాటు ఎడమవైపు పూర్తిగా ధ్వంసమైందని.. టిప్పర్‌లోని కంకర బస్సులోని ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక ఎక్కువమంది మృతి చెందారని వివరించారు.

Updated Date - Nov 04 , 2025 | 02:56 AM