Share News

Encroachments Choke Musi River: మూసీకి కబ్జాల మూత

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:32 AM

మూసీ ఉగ్ర రూపం నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం పొడవునా...

Encroachments Choke Musi River: మూసీకి కబ్జాల మూత

  • నది గర్భంలో భారీగా నిర్మాణాలు.. నార్సింగి వద్ద ఓ బహుళ అంతస్తుల ప్రాజెక్టు

  • విచారణ జరుపుతున్న హైడ్రా.. త్వరలో సర్కారుకు నివేదిక

  • ఇతర ప్రాంతాల్లోనూ కబ్జాలు, ఆక్రమణలు

  • నదిలో తగ్గిపోతున్న వరద ప్రవాహ సామర్థ్యం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మూసీ ఉగ్ర రూపం నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం పొడవునా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధ్యయనానికి చేపట్టాయి. ఈ క్రమంలో ‘హైదరాబాద్‌ విపత్తుల నిర్వహణ, ఆస్తుల సంరక్షణ సంస్థ (హైడ్రా)’ కీలక విషయాన్ని గుర్తించింది. నార్సింగి ప్రాంతంలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ (ఆదిత్య బిల్డర్స్‌) చేపట్టిన బహుళ అంతస్తుల భవనం సెల్లార్‌లోకి భారీగా మూసీ వరద చేరిందని, చుట్టూ రిటైనింగ్‌ వాల్‌ నిర్మించినా నీరు ఆగలేదని గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ భవనం నది ఎఫ్‌టీఎల్‌ పరిధిలోగానీ, బఫర్‌ జోన్‌లోగానీ ఉందా అన్నది తేల్చేందుకు కసరత్తు మొదలు పెట్టింది. గతంలోనూ ఈ బహుళ అంతస్తుల భవనంపై ఫిర్యాదులు అందాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. శనివారం ఈ భవనం నిర్మిస్తున్న ప్రాంతాన్ని కమిషనర్‌ రంగనాథ్‌, అధికారులు సందర్శించారు. డ్రోన్‌ ద్వారా పరిసర ప్రాంతాల్లో వరదను చిత్రీకరించారు. ఆ ప్రాంతంలో వ్యర్ధాలతో నింపి, ఎత్తు పెంచినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అక్కడ నది ఎంత వెడల్పు ఉండాలి? ప్రస్తుతం ఎంత ఉంది? నాడు, నేడు ప్రవాహ సామర్థ్యం ఎంత అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ భవనానికి హెచ్‌ఎండీఏ అనుమతులున్న నేపథ్యంలో.. నిబంధనల ప్రకారమే అనుమతులు ఇచ్చారా? ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌కు సంబంధించి నిరభ్యంతర పత్రం తీసుకున్నారా? ఒకవేళ సమర్పించి ఉంటే ఇచ్చిన అధికారి ఎవరు? క్షేత్రస్థాయిలో, రికార్డులను పరిశీలించే ఎన్‌ఓసీ ఇచ్చారా? అన్నది తేల్చాలని భావిస్తున్నారు. సమగ్ర పరిశీలన తర్వాత దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని రంగనాథ్‌ వెల్లడించారు. నార్సింగి, కోకాపేట వంటి ప్రాంతాల్లో నది ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలు నిర్మించారు. జియాగూడ, అఫ్జల్‌గంజ్‌, మలక్‌పేట, అంబర్‌పేట, ఉప్పల్‌ వంటి ప్రాంతాల్లో పేదల ఇళ్లు ముంపునకు గురవుతుంటే.. నార్సింగి, బండ్లగూడ జాగీర్‌, గండిపేట, కోకాపేట తదితర ప్రాంతాల్లో విల్లాలు, బహుళ అంతస్తుల భవనాల్లోకీ నీళ్లు చేరాయి. జంట జలాశయాల్లో ఆక్రమణలూ వరద తీవ్రతకు కారణమని వాతావరణ మార్పు లు, పట్టణాల్లో వరదల నిపుణుడు బీవీ సుబ్బారావు పేర్కొన్నారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో భవన నిర్మాణాలు ఉన్నాయని.. జలాశయాల్లో వ్యర్థాలు పోసి నిర్మాణాలు చేపట్టడంతో, నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నీరంతా దిగువకు వదలాల్సి వస్తోందని వివరించారు.


ఆక్రమణలతో పెరుగుతున్న ముంపు తీవ్రత

2020లో అతిభారీ వానలతో మూసీలో భారీగా వరద వచ్చింది. కానీ ఇప్పటిస్థాయిలో అప్పుడు కనిపించలేదు. నదిలో ఆక్రమణలతో ప్రవాహ సామర్థ్యం తగ్గి.. కాలనీలు, బస్తీల్లోకి వరద చేరుతోందని నిపుణులు చెబుతున్నారు. చాదర్‌ఘాట్‌ వంతెన నుంచి ఉస్మానియా ఆస్పత్రి వరకు పలు చోట్ల నదిలో వ్యర్థాలు నింపి.. వాహనాల పార్కింగ్‌, ఇతర అవసరాల కోసం వాడుతున్న కబ్జాలను హైడ్రా జూలైలో తొలగించింది. 9.61 ఎకరాల్లో ఆక్రమణల తొలగించినా.. నది గర్భంలో నింపిన మట్టిని తొలగించలేదు. ఎంజీబీఎస్‌ మునగడానికి ఇది కూడా ఒక కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Sep 29 , 2025 | 03:32 AM