Mega Bathukamma Sets Guinness World Record: గిన్నిస్‌బుక్‌లోకి మహా బతుకమ్మ
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:02 AM
అది భారీ బతుకమ్మ. 30-40 మంది కలిసినా ఎత్తలేనంత బరువుగల బతుకమ్మ! ఆ బతుకమ్మ ఎత్తు 63.11 అడుగులు. వెడల్పు 36 అడుగులు. ఇంతటి భారీ బతుకమ్మను పేర్చేందుకు 10.7 టన్నుల మేర వివిధ రకాల పూలను ఉపయోగించారు....
300 మంది మూడు రోజుల పాటు శ్రమించి రూపకల్పన
ఆడిపాడిన 1354 మంది మహిళలు
సరూర్‌నగర్ స్టేడియంలో మహా వేడుక
కార్యక్రమంలో పాల్గొన్న జూపల్లి, సీతక్క
మిస్ వరల్డ్, అందాల భామల సందడి
రికార్డు పత్రాలను మంత్రులకు అందజేసిన గిన్నిస్ ప్రతినిధి స్వప్నిల్
మన్సూరాబాద్/వనస్థలిపురం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అది భారీ బతుకమ్మ. 30-40 మంది కలిసినా ఎత్తలేనంత బరువుగల బతుకమ్మ! ఆ బతుకమ్మ ఎత్తు 63.11 అడుగులు. వెడల్పు 36 అడుగులు. ఇంతటి భారీ బతుకమ్మను పేర్చేందుకు 10.7 టన్నుల మేర వివిధ రకాల పూలను ఉపయోగించారు. 300 మంది మూడు రోజుల పాటు శ్రమించి ఈ మెగా బతుకమ్మను రూపొందించారు. 11 స్టేజీలుగా పేర్చిన ఈ మహా బతుకమ్మ కోసం తొమ్మిది రకాల పూలను వాడారు. ఎల్బీనగర్‌లోని సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో సోమవారం ‘మన బతుకమ్మ’ ఉత్సవాల్లో భాగంగా ఈ బతుకమ్మ స్థానికులను ఔరా అనిపించింది. కార్యక్రమంలో 10వేల మంది మహిళలు పాల్గొన్నారు. ఈ మహా బతుకమ్మ చుట్టూ 1354 మంది మహిళలు కొన్ని వరుసలుగా చేరి బతుకమ్మ ఆడిపాడారు. మరి.. ఇంతటి భారీ బతుకమ్మను పేర్చడం, ఇంతపెద్ద సంఖ్యలో మహిళలు ఆడిపాడటం మామూలు విషయమా? గిన్నిస్ అధికారులే అచ్చెరువొంది.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు కల్పించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ సంస్థ ప్రతినిధి స్వప్నిల్ ఈ వేడుకను వీక్షించారు. గతంలో 36.08 అడుగుల ఎత్తున్న బతుకమ్మ చుట్టూ 474 మంది చేరి ఆడారని.. ఆ రికార్డును ఈ మహా బతుకమ్మ బద్దలు కొట్టిందని స్వప్నిల్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ప్రజాగాయకురాలు విమలక్క, సాంసృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. భారీ ఎత్తుతో కూడిన బతుకమ్మ, భారీ సంఖ్యలో మహిళలు ఆడిపాడటానికి సంబంధించి రికార్డు పత్రాలను గిన్నిస్ ప్రతినిధి మంత్రులకు అందజేశారు. విమలక్క, ప్రముఖ సినీ గాయని గీత తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. వేడుకల్లో మిస్ వరల్డ్, థాయ్ అమ్మాయి ఓపెల్ సుచాట చువాంగ్‌శ్రీ, మిస్ అమెరికా, మిస్ ఏషియా, మిస్ యూరప్, మిస్ కరేబియన్, మిస్ అర్జెంటీనా పొల్గొని సందడి చేశారు.


