Share News

గప్‌చుప్‌!

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:19 PM

మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో పంచాయతీ మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రచారం ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థుల భవిత వ్యం గురువారం తేలిపోనుంది.

గప్‌చుప్‌!
కొత్తపల్లి మండలం మన్నాపూర్‌ పంచాయతీ కార్యాలయం

ముగిసిన గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారం

రేపు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

వారం రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచారం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 129 సర్పంచ్‌.. 1,186 వార్డు స్థానాలకు..

నారాయణపేట జిల్లాలో 53 సర్పంచ్‌, 361 వార్డు స్థానాలకు పోటీ

ఫలితాలపై ప్రభావం చూపనున్న మద్యం.. నగదు పంపిణీ

మహబూబ్‌నగర్‌/ నారాయణపేట, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో పంచాయతీ మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ప్రచారం ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థుల భవిత వ్యం గురువారం తేలిపోనుంది. ఈ 24 గంటలే వారికి కీలకం కానున్నాయి. ఇప్పటిదాకా బాగుందన్న వారి భవిష్యత్తు తలకిందులు కావచ్చు. అంచనాలు లేకుండానే అనామకులు తెరపైకి దూసుకురావచ్చు. చివరి క్షణంలో ఏదైనా జరగొచ్చు. గురువారం 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓ టింగ్‌ ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కించి, సాయంత్రం వర కు ఫలితాలు వెల్లడి స్తారు.

ఎన్నికలు జరిగే మండలాలివే..

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మహబూబ్‌నగర్‌ రూరల్‌, రాజాపూర్‌, గండీడ్‌, మహమ్మదాబాద్‌, నవాబ్‌పేట మండలాల్లోని 139 పంచాయతీలు, 1,188 వార్డు స్థానాలకు ఈనెల 11న ఎన్నికలు జరగాల్సి ఉంది. 10 పంచాయతీలు, 264 వార్డు స్థానాలు ఏకగ్రీవం కావడంతో 129 సర్పంచ్‌, 923 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. సర్పంచ్‌ స్థానాలకు 425 మంది, వార్డు స్థానాలకు 2,195 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

నారాయణపేట జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు, గుం డుమాల్‌, కొత్తపల్లి మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగు మండలాలకు గాను 67 పంచాయతీలలో 14 సర్పంచ్‌ స్థానాలు, 211 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 53 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్‌ స్థానాలకు 156 మంది అభ్యర్థులు, 361 వార్డు స్థానాలకు 806 మంది బరిలో ఉన్నారు.

అప్రమత్తంగా లేకపోతే అంతే

చాలాచోట్ల కాంగ్రె్‌స అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు పోటీపడుతుండగా, కొన్నిచోట్ల బీఆర్‌ఎ్‌సకు చెందిన అభ్యర్థులు ఇద్దరు చొప్పున పోటీ పడుతున్నారు. మరికొన్ని చోట్ల కులాలకు సంబంధించి వాళ్లు ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు పోటీ చేయడం వల్ల ఓట్లు చీల్చుకుని ప్రత్యర్థులకు మేలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలు, కుల పెద్దలు జోక్యం చేసుకుని పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులు విరమించుకుని, ఒక్కరికే మద్దతిచ్చేలా చూస్తారు. మహబూబ్‌నగర్‌ మండలంలోని ఓ గ్రామంలో విపక్ష పార్టీ నుంచి ముగ్గురు పోటీ లో ఉన్నారు. వీరిలో ఇద్దరు తప్పుకుని మూడో వ్యక్తికి మద్దతిస్తే గెలుపు నల్లేరుమీద నడకేనని అనుకుంటున్నారు. దాంతో కాంగ్రెస్‌ అభ్యర్థికి టఫ్‌ ఫైట్‌ కానుంది. ఇదే మండలంలోని 600 ఓట్లున్న ఓ గ్రామంలో ఓ కులానికి చెందిన అభ్యర్థులు ముగ్గురున్నారు. ఇద్దరు తప్పుకుంటే మరో అభ్యర్థికి ఫలితం తారుమారు కానుంది. ఈ గ్రామానికి పక్కనే ఉన్న మరో గ్రామంలో ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ఎవరికి వారుగా ఇలానే రేపటి వరకు పోటీలో ఉంటే తన విజయం ఖాయమని ఓ అభ్యర్థి భావిస్తున్నారు. పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు తప్పుకుని, మరో అభ్యర్థికి మద్దతిస్తే మాత్రం ఫలితం మరోలా ఉండనుంది.

ప్రలోభాలతో తారుమారు?

ఓటర్ల మద్దతు కోసం అభ్యర్థులు రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. డబ్బులున్నవాళ్లు మద్యంతోపాటు, నగదు పంపిణీ చేసి కొంత శాతం ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒక్కో గ్రామంలో 50-100 ఓట్లను ప్రభావితం చేసినా ఫలితాలు తారుమారు కానున్నాయి. మద్యం, నగదుతోపాటు చీరలు, బహుమతులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుర్తులను గుర్తించుకోవడానికి బ్యాట్‌, లేడీస్‌ హ్యాండ్‌ పర్సు తదితర గుర్తులు పంపిణీ చేస్తున్నారు.

మద్యం కొరతతో తికమక

ఎన్నికల్లో ఎక్కువగా సేల్‌ అయ్యే మద్యంపై బేవరీస్‌ రేషన్‌ విధించింది. దీంతో ఆయా బ్రాండ్ల లిక్కర్లు రోజూ ఒక్కో దుకాణానికి 3-4 కాటన్ల మద్యం మాత్రమే పంపిణీ అవుతోంది. దాంతో ఫలానా బ్రాండ్‌ కావాలని అడ్వాన్స్‌ ఇచ్చిన వ్యాపారులు పోటీదారులకు మద్యం పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. మహ్మదాబాద్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అభ్యర్థి ముందుగానే రూ.3 లక్షల విలువ గల మద్యం డంప్‌ చేసుకున్నారని తెలుస్తోంది. రూరల్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన అభ్యర్థి కూడా తమకు తెలిసిన మద్యం దుకాణం నుంచి నాలుగైదు రోజుల క్రితమే మద్యం దిగుమతి చేసుకున్నారని సమాచారం. ప్రచారం ముగియడంతో మద్యం దుకాణాలు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచే మూతపడ్డాయి. వీటిని ఈనెల 11న సాయంత్రం తరువాత తెరువనున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 11:19 PM