Share News

Mahesh Goud: ఓట్ల వేటకు పార్కుల బాట

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:44 AM

ఎవరు ఔనన్నా కాదన్నా.. ఎన్ని ప్రచార సభలు, రోడ్‌ షోలు నిర్వహించినా నేరుగా ఓటరును కలిసి ప్రసన్నం చేసుకుంటేనే ఎన్నికల...

Mahesh Goud: ఓట్ల వేటకు పార్కుల బాట

  • ఉదయం, సాయంత్రం నడక వేళల్లో ఓటర్లను కలిసి ప్రసన్నం చేసుకునేందుకు నేతల ప్లాన్‌

  • ఒకేరోజు పార్కుల్లో ప్రచారం చేసిన కిషన్‌రెడ్డి, పొన్నం, మహేశ్‌గౌడ్‌, బోయినపల్లి వినోద్‌ కుమార్‌

హైదరాబాద్‌, యూసు్‌ఫగూడ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎవరు ఔనన్నా కాదన్నా.. ఎన్ని ప్రచార సభలు, రోడ్‌ షోలు నిర్వహించినా నేరుగా ఓటరును కలిసి ప్రసన్నం చేసుకుంటేనే ఎన్నికల ప్రచారానికి సార్థకత! పల్లెప్రాంతాల్లోనైతే సాగు పనులకు వెళ్లే రైతులను, కూలీలను కలిసి వారి పనుల్లో ఓ చేయివేయడం ద్వారా నేతలు ప్రచారం నిర్వహిస్తుంటారు. ఇప్పుడు జరిగేది హైదరాబాద్‌ నడిబొడ్డులోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉపఎన్నిక! ఇక్కడ ప్రజలు ఉదయం పదింటికల్లా వివిధ పనుల కోసం ఇంట్లోంచి బయటపడితే మళ్లీ సాయంత్రమెప్పుడో ఇంటికి తిరిగొస్తారు. కొందరు రాత్రివేళల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల పనివేళలూ భిన్నంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఓటర్లను కలిసేది ఎలా? దీనిపైనే ముమ్మర కసరత్తు చేసిన వివిధ పార్టీల నేతలు ఓ నిర్ణయానికొచ్చారు. ఓటర్లు అందుబాటులో ఉండే సమయాల్లోనే వారిని కలిసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకు వారు ఎంచుకుంది. ‘ఉదయం, సాయంత్రం నడక వేళల్లో’ ప్రచారం చేయాలని! శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం నడకే చక్కని మార్గం అనే అవగాహన ప్రజల్లో బాగా పెరగడం, ప్రత్యేకిం చి నగర ఓటర్లలో ఎక్కువమంది ఉదయం, సాయంత్రాల్లో పార్కులో వాకింగ్‌ చేస్తుండటంతో నేతలు తదనుగుణంగా ప్రచార షెడ్యూల్‌ను మార్చుకుంటున్నారు. వాకింగ్‌ చేసే సమయాల్లోనే ఓటర్ల వద్దకు వెళ్లటం, వారితో కలిసి నడవటం, వారితో ముచ్చటించటం, తమపార్టీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పటం, తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని విన్నవించడం వంటివి చేస్తున్నారు. ఆదివారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌.. కృష్ణకాంత్‌ పార్కులో వాకింగ్‌ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లతో మాటామాటా కలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నేతలు కూడా వాకింగ్‌ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రతిరోజు ఇదేతరహాలో నియోజకవర్గం పరిధిలో ఉన్న పార్కుల్లో ప్రచారం చేసేలా షె డ్యూలు రూపొందించుకున్నారు. కేబీఆర్‌, కృష్ణకాంత్‌ పార్కులు మొదలుకొని.. ఎర్రగడ్డ, బోరబండ, యూసు్‌ఫగూడ, వెంగళరావునగర్‌, రెహమత్‌నగర్‌, షేక్‌పేట డివిజన్లలో ఉన్న చిన్నా, పెద్ద పార్కుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం కృష్ణకాంత్‌ పార్క్‌లో ప్రచారం నిర్వహించారు. బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తదితర బీఆర్‌ఎస్‌ నేతలు తమ అనుచరులతో పార్కుల్లో ఓటర్లను కలిసి తమ పార్టీ అభ్యర్థికి ఓటెయ్యాలని అభ్యర్థించారు.


ప్రచార వేళలపై సీఎం ఫోకస్‌.. పీసీసీ చీఫ్‌తో చర్చలు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారసరళిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టారు. ప్రచారానికి మరో వారం రోజుల సమయమే ఉండటంతో.. ప్రచార శైలి మార్చాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌తో కూడా ఈ అంశంపై చర్చించారు. పూర్తిగా నగర ఓటర్లు కావటంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంట ల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గట్టిగా ప్రచారం చేయాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాలనీల్లో ఎవరూ అందుబాటులో లేనప్పుడు ప్రచారం చేసినా ప్రయోజనం ఏముంటుందని సీఎం ప్రశ్నించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నేతలంతా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ క్రమంలోనే ఆదివారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌.. వాకింగ్‌ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాగా ఈ సమయంలో కొందరు వాకర్స్‌ తమ సమస్యలను కూడా చర్చకు తెస్తున్నారు. అధికారపార్టీ నేతలు సమస్యల పరిష్కారానికి భరోసా ఇస్తున్నారు. విపక్షనేతలు పార్టీల నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఓటర్లతో చెబుతున్నారు. కాగా వాకింగ్‌ జోన్‌కు, పార్కులకు ఒకేసారి రెండు, మూడు పార్టీలకు చెందిన నాయకులు వచ్చినపుడు వాకర్లు కాస్త ఇబ్బందులు పడుతున్నారు. కొందరు మొహమాటానికి గురవుతున్నారు.

Updated Date - Nov 03 , 2025 | 03:44 AM