పోకిరీలపై కొరడా
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:03 AM
పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా షీ టీం పోలీసులు పోకిరీలపై కొరడా ఝలిపిస్తున్నారు.
- నెల రోజుల్లో 70 మంది ఈవ్‌టీజర్ పట్టివేత
- ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు
- వేధింపులు ఎదుర్కొంటే డయల్ 100, షీటీం వాట్సప్ నం. 8712670759కు ఫిర్యాదు చేయాలంటున్న పోలీసులు
కరీంనగర్ క్రైం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా షీ టీం పోలీసులు పోకిరీలపై కొరడా ఝలిపిస్తున్నారు. విద్యార్థినులు, యువతులు, బాలికలు, మహిళల్లో భద్రతాభావాన్ని పెంపొందిస్తూ నూతనోత్సాహంతో షీ టీంలు ముందుకుసాగుతున్నాయి. కమిషనరేట్ వ్యాప్తంగా 10కిపైగా షీ టీంలు పని చేస్తున్నాయి. ఇటీవల జిల్లాలోని ఒక పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ బాలికల వాష్‌రూంలో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసి, బాలికపై వేధింపులకు, లైంగికదాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో షీటీం పోలీసుల నిఘాను మరింత పెంచారు. బాలికలు, మహిళలు, విద్యార్థినులు, పోకిరీల వేధింపులను ఎదుర్కొంటే ఫిర్యాదు చేసే విధానంపై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా అవగాహనకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళలు విద్యార్థినిల పోకిరీల వేధింపులను భరించాల్సిన అవసరం లేదనే నిర్ణయంతో షీటీంకు చెందిన పోలీసులు మఫ్టీలో ముఖ్య కూడళ్ల వద్ద నిఘాపెట్టి పోకిరీలను ఆధారాలతో సహపట్టుకునేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు. వేధింపుల తీవ్రతనుబట్టి తల్లిదండ్రుల సమక్షంలో ఆధారాలను చూపిస్తూ కౌన్సెలింగ్‌లను నిర్వహించడంతోపాటు క్రిమినల్ కేసులను నమోదుచేస్తూ షీటీంలు పోకిరీలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్టోబరు నెలలో పోకిరీల వేధింపులపై షీటీం పోలీసులకు వాట్సప్, క్యూఆర్ కోడ్ ద్వారా, పోలీస్‌కమిషనర్ ద్వారా, ఇతర పోలీసు ఠాణాలు, అధికారుల ద్వారా పలు ఫిర్యాదులు అందాయి. ఇందులో వేధింపుల తీవ్రత ఆధారంగా నిందితులపై ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరో 38 పోకిరీలను షీటీం పోలీసులు రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిపై పెట్టీ కేసులు నమోదు చేసి, 13 మందికి కుటుంబం సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మరి కొందరిని హెచ్చరించి వదిలేశారు.
ఫ గుడ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన
విద్యాసంస్థలకు షీ టీం పోలీసులు వెళుతూ అశ్లీలత, వేధింపుల తీవ్రత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌లపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. వేధింపులు ఎదుర్కొన్న వారు డయల్ 100, వాట్సప్ నంబర్ 8712670759, క్యూఆర్‌కోడ్ ద్వారా ఫిర్యాదు చేయాలని స్టాల్స్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన టీ సేఫ్ యాప్‌ను స్మార్ట్‌పోన్ ఉన్న విద్యార్థినులు, మహిళలతో డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. అక్టోబరులో కరీంనగర్, హుజూరాబాద్ పోలీస్ సబ్ డివిజన్లలో షీ టీంల ఆధ్వర్యంలో 42 అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
ఫ ముఖ్య కూడళ్లలో షీ టీంల నిఘా...
వేధింపులు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో షీ టీంలు నిఘా పెడుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ద్వారా పోకిరీల ఆధారాలను సేకరిస్తూ రెడ్‌హాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఫిర్యాదు చేసిన మహిళలు, విద్యార్థినులను స్టేషన్లకు పిలిపించకుండా వారఇ వద్దకు వెళ్లి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారరి
ఫ మహిళలు, విద్యార్థినుల రక్షణే షీటీం లక్ష్యం...
- పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
మహిళలు, యువతులు, బాలికల రక్షణకు అత్యంత ప్రాధానత్య ఇస్తున్నాం. వారి రక్షణే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఆకతాయిలు, ఇతర వేధింపుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఏ మాత్రం భయం లేకుండా డయల్ 100, షీటీం వాట్సప్, కూఆర్‌కోడ్ ద్వారా పోలీసులను సంప్రదించాలి. సోషల్‌మీడియా వినియోగించే మహిళలు, యువతులు, విద్యార్థినులు వ్యక్తిగత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు పాటించాలి. భద్రత కోసం టీ-సేఫ్ యాప్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి.