Telangana Jagruthi President Kalvakuntla Kavitha: పూలమ్మిండు.. పాలమ్మిండు.. వేల ఎకరాలు కబ్జా పెట్టిండు!
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:18 AM
బంగారు తెలంగాణ(బీటీ) బ్యాచ్ ఎమ్మెల్యేలు తాము అధికారంలో ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా అభివృద్ధిని పక్కనపెట్టి చెరువులు, భూములను కబ్జా చేశారని తెలంగాణ జాగృతి.....
మల్లారెడ్డి పేదలకు చేసిందేమీ లేదు
కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి ఎమ్మెల్యేలు కబ్జాలు ఆపాలి: కల్వకుంట్ల కవిత
కేపీహెచ్‌బీకాలనీ/కూకట్‌పల్లి, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): బంగారు తెలంగాణ(బీటీ) బ్యాచ్ ఎమ్మెల్యేలు తాము అధికారంలో ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా అభివృద్ధిని పక్కనపెట్టి చెరువులు, భూములను కబ్జా చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీఆర్‌ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన ఇంటిలో జరిగిన శుభకార్యానికి సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించి మనుమడితో ఆయన కాళ్లు మొక్కించారని.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా మల్లారెడ్డి ఆక్రమణలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ‘ఐదేళ్లు మంత్రిగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి.. పూలమ్మిండు, పాలమ్మిండు, వేల ఎకరాలు కబ్జా పెట్టిండు. ఆయన పేదలకు చేసిందేమీ లేదు’ అని తీవ్ర విమర్శలు చేశారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి ఎమ్మెల్యేలు కబ్జాలు చేయడం ఆపి, తమ నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. కూకట్‌పల్లిలోని సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో మంత్రి పదవులు బీటీ బ్యాచ్‌కే దక్కాయని, ఉద్యమకారుడు శంభీపూర్ రాజుకు పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు లేవన్నారు. మేడ్చల్ కలెక్టరేట్ కూడా అందరికీ ఆమోదయోగ్యంగా లేదని చెప్పారు. జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ 100 పడకల ఆస్పత్రి లేకపోవడం ఇక్కడి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారుకు కూకట్‌పల్లి భూములు కామధేనువులాగా మారాయని ఆరోపించారు. కేపీహెచ్‌బీలో ఇప్పటికే రూ.2వేల కోట్ల భూములు అమ్ముకున్న ప్రభుత్వంఇక్కడి ప్రజల అవసరాల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడుగుతున్న నాయకులు ఇక్కడి ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.