Health: అనారోగ్యం.. వారసత్వం!
ABN , Publish Date - Jan 11 , 2025 | 04:47 AM
తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఆస్తులు లభించటం అటుంచితే.. అనారోగ్య సమస్యలు కూడా వారసత్వంగా సంక్రమిస్తాయని ప్రముఖ హెపటాలజిస్ట్ (కాలేయ నిపుణులు), ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ డైౖరెక్టర్ ప్రొఫెసర్ శివకుమార్ సరీన్ తెలిపారు.
కుటుంబంలో వ్యాధుల పరంపర ఉంటే.. పిల్లలకూ సంక్రమిస్తాయి.. గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి
పిల్లల్లో ఫ్యాటీలివర్ సమస్య పెరుగుతోంది
తీవ్రమైన జబ్బులున్న వాళ్లు పిల్లల్ని కనకపోవటం మంచిది
మద్యం క్యాన్సర్ కారకం
ఆరోగ్య పరిరక్షణ కుటుంబం సమష్టిగా చేయాల్సిన పని
మీ శరీరానికి మీరే బాస్‌లు.. డాక్టర్లకు ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వొద్దు
ప్రముఖ కాలేయ నిపుణులు ప్రొఫెసర్ శివకుమార్ సరీన్
‘‘ఓన్ యువర్ బాడీ’ పుస్తకావిష్కరణలో ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో సంభాషణ
హైదరాబాద్ సిటీ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఆస్తులు లభించటం అటుంచితే.. అనారోగ్య సమస్యలు కూడా వారసత్వంగా సంక్రమిస్తాయని ప్రముఖ హెపటాలజిస్ట్ (కాలేయ నిపుణులు), ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ డైౖరెక్టర్ ప్రొఫెసర్ శివకుమార్ సరీన్ తెలిపారు. అందువల్లే, ఆస్తుల విషయాలే కాకుండా కుటుంబంలో తరతరాలపాటు కొనసాగుతున్న జబ్బుల గురించి కూడా తెలుసుకుని సంతానానికి అవి సోకకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో నిర్వహించిన ’వెల్ బీయింగ్ షో’లో.. శివకుమార్ సరీన్ రాసిన ‘ఓన్ యువర్ బాడీ’ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి.. సరీన్‌తో సంభాషించారు.
నాగేశ్వర్‌రెడ్డి: ఈ మధ్య ఫ్యాటీ లివర్ సమస్యపై ఎక్కువగా దృష్టి సారించినట్లున్నారు.
సరీన్ : ఇప్పుడు ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రంగా తయారైంది. ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. ఇది అంతర్జాతీయంగా సమస్యగా మారుతోంది. 1999-2000లోనే ఫ్యాటీ లివర్ సమస్య చిన్నతనంలోనే వస్తుందని గుర్తించాం. తల్లిదండ్రులతోపాటు స్కూల్స్ కూడా జాగ్రత్తగా వ్యవహ రించాలని సూచిస్తున్నప్పటికీ ఎవరూ దీని గురించి ఆలోచనే చేయడం లేదు. ప్రస్తుతం ఫ్యాటీ లివర్ జీవనశైలి సమస్యగా మారింది. రోజుకు 40-45 నిమిషాలపాటు వ్యాయామాలు చేయాలి. కానీ చాలామందికి ఆ ఊసే ఉండటం లేదు. అటువంటప్పుడు వారు ఆరోగ్యంగా ఎలా ఉండగలరు?
స్కూల్స్ సమీపంలో జంక్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై నిషేధం విధిస్తే మంచిదా?
మనం చదువుకున్న రోజుల్లో జంక్ ఫుడ్ అంటూ ఉండేది కాదు. పాలు, మజ్జిగ, పళ్లరసాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం జంక్ ఫుడ్ పెరిగిపోయింది. అయితే, ఆ సెంటర్లను నిషేధించమని చెప్పను. ఏది తినాలి, ఏది తినకూడదనే అంశం పట్ల ప్రజల్లోనే అవగాహన లేదు. ఎందుకంటే మన దగ్గర సరైన సమాచారం లేదు. అమెరికాలో సగటున ఒక విద్యార్థి తాగే కోలాల (శీతల పానీయాల) ద్వారా సంవత్సరానికి 24 కిలోల ఫ్రక్టోజ్ ఆ విద్యార్థి శరీరంలో చేరుతోందని తేలింది. అదే ఫ్యాటీ లివర్‌కు అతి ప్రధానకారణం.
మద్యం మంచిదా? కాదా?.. దేశంలో మద్యం వినియోగం పంజాబ్ తర్వాత హైదరాబాద్‌లోనే అధికంగా ఉంది.
అప్పుడప్పుడూ మద్యం తీసుకున్నా ఆరోగ్యానికి ఇబ్బందే. కానీ సామాజికంగా అంగీకరించిన విషమది. అది క్యాన్సర్ కారకం. ఇటీవలనే సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికా ఆల్కహాల్‌ను కార్సినోజెనిక్ (క్యాన్సర్ కారకం)గా ప్రకటించింది.
హెపటాలజీ ఓ ప్రత్యేక విభాగంగా లేని రోజుల్లోనే మీరు ఆ రంగంలో కృషి చేయడం, తొలుత గ్యాస్ట్రో ఎంటరాలజీలోకి ప్రవేశించి ఆ తర్వాత హెపటాలజి్‌స్టగా మారడానికి స్ఫూర్తి ఎవరు?
1978లో నేను డాక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు కాలేయ ఇబ్బందులపై దృష్టి పెట్టా. పరిశోధన కూడా చేశాను. ఆ తర్వాత హెపటాలజీ పట్ల ఆసక్తి కలిగింది. ప్రొఫెసర్ బీ ఎన్ టాండన్ ప్రభావం నాపై చాలా ఉంది. ఆయన ఆలోచనా విధానం, క్రమశిక్షణ నాకు ఎంతో స్ఫూర్తి కలిగించాయి. జీబా నీడిల్ ఆవిష్కర్త కునియో ఖుడా కూడా నాకు స్ఫూర్తినిచ్చారు.
‘ఓన్ యువర్ బాడీ’ పుస్తకం రాయడానికి కారణం?
నా అనుభవాలే కారణం. ఈ పుస్తకంలో 21 కేసుల గురించి చర్చించాం. నా దగ్గరకు వచ్చిన రోగులలో ఒకరు కాలేయ మార్పిడి చేయించుకున్నారు. అతని సోదరునికి కూడా అదే సమస్య. అప్పుడే కుటుంబ ఆరోగ్య చరిత్ర ఎంత మేరకు కారణమవుతుందనే ఆలోచన చేశాను. అలాగే పిత్తాశయంలో రాళ్ల సమస్యతో ఒక పాప వచ్చింది. ఆ పాప తల్లిదండ్రుల్లోనూ ఆ సమస్య ఉంది కానీ వారికి నొప్పి లేదు. అది 1989లో. మేం పరిశోధనలు చేసి ఐదేళ్ల తర్వాత పిత్తాశయంలో రాళ్లను కాలేయ వ్యాధిగా గుర్తించాం. అది జన్యుపరమైనదని చెప్పాం. 1995లో అలా చెప్పిన మొట్టమొదటి పరిశోధనా పత్రం మాదే. మరో కేసులో ఓ ఏడేళ్ల బాలికకు పాన్‌క్రియా్‌స సమస్య వచ్చింది. ఇప్పటికీ ఆమె ఆ సమస్యతో ఉంది. ఊబకాయంతోనూ బాఽధపడుతోంది. ఆమె తల్లిదండ్రుల జన్యువుల కారణంగా ఆమెకు మధుమేహమూ ఉంది. ఆమె కథకూడా దీంట్లో ఉంది.
మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?
చక్కగా నిద్రపోతాను. మా అమ్మనాన్నల నుంచి వచ్చిన జన్యువులు మరో కారణం. రోజుకు ఒకసారి మాత్రమే తింటాను. తినే ఆహారంలో 60ు వండని ఆహారపదార్థాలు (పచ్చివి) తింటాను. విందులకు వెళ్తే ముందే తిని వెళ్తాను. వ్యాయామాలు గంట పాటు చేస్తాను.
ఆరోగ్యంపై 3 ముఖ్యమైన అంశాలు అంటే ఏం చెబుతారు?
ఆరోగ్యం అనేది కుటుంబానికి సంబంధించిన అంశం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. కనీసం 15 రోజులకు ఓసారైనా కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి వెచ్చించాలి. ఈ విషయంలో ఇంటి పెద్ద... అంటే ఆడవాళ్లు బాస్‌లా వ్యవహరించాలి. ఆమె ఎప్పుడూ బాసే కదా! ఎవరు ఏం తినాలి? ఎవరు ఎంత సమయం వ్యాయామం చేయాలో నిర్ణయించి అమలు చేయాలి. రెండవది... మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలున్న దంపతులు పిల్లలను కనే విషయంలో పునరాలోచించుకోవాలి. భావితరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్త తప్పదు. ఓ పదేళ్ల కుర్రాడు తన ఊబకాయం, మధుమేహానికి తన తల్లిదండ్రులే కారణమంటే.. ఆ బాలుడి పరిస్థితిని ఊహించుకోవచ్చు. అందుకే మీరు ఆరోగ్యంగా లేకపోతే పిల్లలను కనవద్దు. మూడవది లాంగిటివిటీ.. డెత్ ఆఫ్ ఏజింగ్ (దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించటం). దేహం స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంచుకునే కృషి చేయాలి. అప్పట్లో ఒనిడా టీవీ ప్రకటనలా ‘ఓనర్స్ ప్రైడ్.. నైబర్స్ ఎన్వీ’ (యజమానికి గర్వం.. పొరుగువారికి ఆసూయ కలిగించే టీవీ) అనిపించేలా మీ శరీర తీరు ఉండాలి. మీ శరీరానికి మీరే బాస్‌లు. దాన్ని డాక్టర్లకు ఔట్ సోర్స్ చేయొద్దు.