శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలం జగరాజుపల్లి గ్రామ సమీపంలోని పంటపొలాల్లో ఉన్న ఒక వేపచెట్టు నుండి కల్లు ధారగా కారుతుండటం స్థానికులను, చుట్టుపక్కల గ్రామ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. చెట్టు పైభాగం నుండి కింది వరకు ద్రావకం కారడం చూసి గ్రామస్తులు దీనిని దైవ సంకేతంగా భావించారు. వెంటనే ఆ చెట్టుకు పసుపు, కుంకుమతో అలంకరించి, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీర బ్రహ్మేంద్రస్వామి ప్రవచనాల్లో వేపచెట్టులో కల్లు కారుతుందనే సూచన ఇప్పుడు నిజమవుతోందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. భక్తులు ఆ వేపచెట్టును భక్తిభావంతో దర్శించుకుంటూ, ఇది దైవకృపకు సంకేతమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.