నెల్లూరు జిల్లా కలువాయిలోని రుక్మిణి సమేత పాండురంగ స్వామి ఆలయంలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఆలయ తలుపుల తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. రుక్మిణి అమ్మవారి మెడలోని రెండు మంగళసూత్రాలతో పాటు హుండీని అపహరించుకుపోయారు. దొంగిలించిన సొత్తు విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పది రోజుల క్రితమే ఇక్కడి శివాలయంలో కూడా చోరీ జరగడం, ఇప్పుడు మళ్ళీ పాండురంగ స్వామి గుడిలో దొంగతనం జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా దేవాలయాలనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.