జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన హజరత్ అలీ సాహెబ్ ఉరుసు సందర్భంగా బరువెత్తుడు పోటీలు అద్భుతంగా జరిగాయి. స్థానిక కుస్తీ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ జరిగిన ఈ పోటీల్లో దొబ్బుడు గుండు, చందారాలు ఎత్తే విభాగంలో కర్ణాటకకు చెందిన కర్ణ 178 కిలోల భారీ బరువును ఎత్తి మొదటి స్థానం సాధించాడు. అయిజ మండలానికి చెందిన లాల్ బాషా, షబ్బీర్ లు వరుసగా రెండో, మూడో స్థానాలు దక్కించుకున్నారు. ఒక చేతితో 100 నుంచి 125 కిలోల బరువున్న రాళ్లను పహిల్వాన్లు ఎత్తిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.